Politics

తెలంగాణాలో జనసేన వ్యూహం ఇదేనా ?

ఇప్పటికే దేశమంతా ఎన్నికల వేడి రాజుకుంటే,ముందస్తు ఎన్నికలకు సిద్ధం చేస్తూ అసెంబ్లీని రద్ద్దుచేసి టి ఆర్ ఎస్ తెలంగాణాలో ఎన్నికల యుద్ధానికి వ్యూహం పన్నింది. దీంతో మేలో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ లోనే జరిగేలా పరిస్థితి వచ్చేసింది. దీంతో ఆయా పార్టీలు ఎన్నిక బరిలో దిగడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అసెంబ్లీని రద్దుచేస్తూనే టికెట్లు కూడా ప్రకటించడం ద్వారా టి ఆర్ ఎస్ అందరికంటే ముందుగా ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక కాంగ్రెస్,టిడిపి ఇలా కొన్ని పార్టీలు మహాకూటమిగా ఏర్పడబోతున్నాయి. ఇక బిజెపి ఒంటరిగా పోటీకి సై అంటోంది.
విషయం ఇలా ఉంటె,తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాలకు పోటీచేస్తామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణా బరిలో జనసేన ఉంటుందా లేదా అన్నది ఇంకా ప్రకటించలేదు.

అన్ని పార్టీల్లో ఎన్నికల హడావిడి మొదలైతే,జనసేనలో ఆ సందడి ఇంకా కానరావడం లేదు. ఎందుకంటే ఏపీలో జనసేన పర్యటనలు స్టార్ట్ కావడం,ప్రజల్లోకి పవన్ దూసుకెళ్తూ,ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఏపీలో యితర పార్టీల నుంచి నేతలు జనసేనలోకి వలస వస్తున్నారు. మంచి జోష్ మీదే ఏపీలో కనిపిస్తోంది. అయితే ముందస్తు ఎన్నికలు జరగబోతున్న తెలంగాణాలో మాత్రం జనసేనలో ఆ జోష్ కనిపించడం లేదు.

అసలు పార్టీ బలోపేతానికి ఒక్క అడుగు కూడా వేయలేదని చెప్పాలి. ఏపీలో ఉన్నట్టు అక్కడ నాయకులూ పెద్దగా కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో జనసేన వ్యూహం ఎలా ఉంటుందో కనీసం అధికార ప్రతినిధులు సైతం నోరు విప్పడం లేదు. ఒకసారి గతంలోకి వెళ్తే,మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో చూస్తే, ఆపార్టీ 18సీట్లు గెలుచుకుంది. అయితే అందులో తెలంగాణలో ఒకే ఒక్క సీటు ఆ పార్టీకి వచ్చింది. మిగిలిన 17సీట్లు కోస్తా, రాయలసీమలోనే వచ్చాయి.

మరి ఇప్పుడు తెలంగాణలో ముందే వచ్చేసిన ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందా అంటే,గతంలో పవన్ చెప్పినట్టే పార్టీ పోటీలో ఉంటుందని, అన్ని సీట్లకు పోటీ చేస్తామని కార్యకర్తలు అంటున్నారు. అయితే ఆదిశగా ఎలాంటి ప్రయత్నాలు కనిపించడం లేదు. పవన్ కళ్యాణ్ మౌనం దాల్చడం, ఇంతవరకూ ఆపార్టీ నేతలెవ్వరూ కూడా అధికారికంగా తెలంగాణా ఎన్నికలపై స్పందించకపోవడం చూస్తుంటే, అసలు ఆ పార్టీ పోటీలో ఉంటుందా, ఉంటే సింగిల్ గానా, ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనసేన తో పొత్తుకు సిపిఎం సిద్ధంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.