Politics

గాడ్సే గాంధీని ఎలా చంపాడో-గాడ్సే మాటలలో

“పిస్టల్ నా కుడి అరచేతిలో ఇముడ్చుకొని, రెండు చేతులూ ముకుళించి ‘నమస్తే’ అన్నాను. నా ఎడమ చేతితో అడ్డంగా ఉన్న ఒక అమ్మాయిని పక్కకు తోసేసాను. ఆ తరువాత కాల్పులు జరిగాయి, తుపాకీ దానంతటే పేలిందనిపించింది. నేను రెండు సార్లు కాల్చానా, మూడు సార్లు కాల్చానా అన్నది నాకెప్పటికీ తెలియని విషయం. గాంధీ గుండు దెబ్బ తగలగానే హే రామ్ అని కిందపడిపొయ్యాడు. నేను తుపాకీని పైకెత్తి గట్టిగాపట్టుకొని నిలుచుని ‘పోలీస్! పోలీస్!’ అని అరవటం మొదలు పెట్టాను. నాకు కావలిసింది అందరూ, నేను ఈ పని ముందుగావేసుకొన్న పథకం ప్రకారం కావాలని చేసానని అనుకోవాలి, అంతేకాని, ఏదో క్షణికావేశంలో చేశాననుకోకూడదు. అక్కడనుంచి తప్పించుకుని పారిపోవటానికి పయత్నించాననిగానీ, తుపాకీ వదిలించుకొవలని అనుకుంటున్నానని గాని ఎవరూ అనుకోకూడదు. తుపాకీతోసహా పట్టుబడటమే నా అభిమతం. కానీ దాదాపు ఒక అర నిమిషందాకా, ఎవరూ కదలలేదు”.

నాథూరామ్ గాడ్సే హత్యా స్థలంనుండి పారిపోయే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు, అతన్ని నిర్బంధించి తుగ్లక్ రోడ్ పోలీసు స్టేషనుకు తీసుకొని వెళ్ళారు. అక్కడ ఉపపోలీస్ సూపరింటిండెంట్ సర్దార్ జస్వంత్ సింగ్ మొదటి సమాచార నివేదిక (First Information Report) తయారు చేసాడు. న్యాయ స్థానాలలో తగిన విచారణ అనంతరం నాథూరామ్ గాడ్సేను అతనికి హత్యలో సహకరించిన నారాయణ ఆప్టేలను 1949 నవంబరు 15న ఉరి తీసారు.