Politics

గాంధీ గారు ఎలా చనిపోయారో తెలుసా?

1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా ఆయనను నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ “హే రామ్” అన్నాడని చెబుతారు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆయన మాటల ప్రకారం”1948 జనవరి 30వ తేదీ సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చారు.

అప్పుడు గాంధీ పక్కనే ఉన్న సహచరి అఛాఛటోపాధ్యాయ గాడ్సేను పక్కకు నెట్టివేస్తూ ఆలస్యమైంది పక్కకు జరగండి అంటూ తోస్తూనే ఉంది. కానీ గాడ్సే పాయింట్ 380 ఏసీపీ, 606824 సీరియల్ నెంబర్ కలిగిన బెరెట్టా ఎం 1934 అనే మోడల్ సెమి-ఆటోమెటిక్ పిస్టల్‌తో గాంధీ ఛాతిలోకి మూడుసార్లు కాల్చారు. దీంతో బాపూజీ అక్కడికక్కడే కుప్పకూలారు.

కానీ ఆ సమయంలో బాపు ‘హేరాం’ అని ఉచ్ఛరించలేదు.గాంధీపై కాల్పులు జరిపిన గాడ్సే అనంతరం తనంతట తానే పోలీస్ అని కేక వేసి లొంగిపోయారు.” గాంధీ అనుచరుల్లో ముఖ్యులైన శ్రీనందలాల్ మెహతా మాత్రం తాను ఇచ్చిన ఎఫ్‌ఐఆర్‌లో గాంధీ హేరాం అంటూ నేలకొరిగారనే సమాచారాన్ని ఇచ్చారు. గాడ్సే కాల్చిన ఒక బుల్లెట్ గాంధీ ఛాతిలోకి దూసుకొని పోగా మిగిలిన రెండు బుల్లెట్లు పొట్ట నుంచి దూసుకెళ్లాయి.