Devotional

దసరా రోజు జమ్మి చెట్టుకు ఇలా పూజ చేస్తే శని దోషాలు,శత్రు బాధలు తొలగిపోతాయి

ఆశ్వయుజ మాసం శుక్లపక్షంలోని మొదటి తొమ్మిది రోజులు శరన్నవరాత్రుల పేరుతో అమ్మవారిని పూజిస్తాం. ఈ తొమ్మిది రోజుల్లో చివరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ముఖ్యమైనవి. విజయదశమి రోజున భగీరధుడు గంగను భూమి మీదకు తీసుకువచ్చాడు. నవరాత్రుల్లో ముఖ్యమైన తిధి నవమి. ఈ రోజు మంత్ర సిద్ది కలుగుతుంది. దేవి ఉపాసకులు అంత వరకు తాము చేసిన జప సంఖ్య ఆధారంగా హోమాలను నిర్వహిస్తారు. అలా వ్రత సమాప్తి గావించిన వారికి సర్వసిద్ధులు మరియు కోరిన కోరికలు తీరతాయని నమ్మకం. ఈ రోజు క్షత్రియులు, కార్మికులు, వాహనదారులు, కులవృత్తులవారు ఆయుధపూజను నిర్వహిస్తారు.

దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని పురాణాల్లో పేర్కొన్నారు. ‘శ్రవణా’ నక్షత్రంతో కలసిన ఆశ్వీయుజ దశమికి ‘విజయా’ అనే సంకేతముంది. అందుకే దీనికి‘విజయదశమి’అనే పేరు వచ్చినది. ఏపనైనా తిథి, వారం, తారాబలం, గ్రహబలం, ముహూర్తం మొదలైనవి చూడకుండా విజయదశమి రోజు ప్రారంభిస్తే విజయం తప్పనిసరిగా కలుగుతుంది.

దశమి రోజు ‘శమీపూజ’ మరింత ముఖ్యమైంది. శమీవృక్షమంటే ‘జమ్మిచెట్టు’.పాండవులు అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను శమీవృక్షంపైనే దాచిపెట్టారు. అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, తిరిగి ఆయుధాలను పొంది, శమీవృక్ష రుపంలోని ‘అపరాజితా దేవి’ ఆశీస్సులు పొంది, కౌరవులపై విజయం సాధించినారు. శ్రీరాముడు విజయదశమి నాడే అపరాజితా దేవిని పూజించి, రావణుని సహరించాడు.

విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించి, ‘శమీ శమయతే పాపం శమీశతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ’ అనే ఈ శ్లోకం స్మరిస్తూ చెట్టుకు ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి కృప, శనిదోష నివారణ జరుగుతుందని ప్రతీతి.