శంకరాభరణం సోమయాజులు అసలు అలా ఎందుకు చేసారో ఇప్పటికీ మిస్టరీయే
ఎవరికైనా అణకువ రావడం కష్టమేమో గానీ, అహంకారం,విజయ గర్వం ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఇక విజయం దరిజేరగానే భజన పరుల గుప్పిట్లో బందీ అయిపోయి ఏమి చేస్తున్నామో,ఎలా వ్యవహరిస్తున్నామో కూడా తెలీదు. మూలలను మరిచిపోతారు. సరిగ్గా శంకరాభరణం శంకరశాస్త్రి పాత్ర పోషించిన తర్వాత జెవి సోమయాజులు విషయంలో అదే జరిగింది. ఈ సినిమా ఎంతపేరు తెచ్చిందో నటుడిగా కూడా అంత నష్టం కల్గించింది. జెవి శివరామ మూర్తి 5గురు సంతానంలో జెవి సోమయాజులు రెండో సంతానం. ఈయనకు జెవి రమణ మూర్తి తమ్ముడు. ఇద్దరూ కల్సి రంగస్థలం మీద ఎన్నో పాత్రలకు ప్రాణప్రతిష్ట చేసారు. ముఖ్యంగా కన్యాశుల్కంలో రామప్ప పంతులు వేషం కట్టి సోమయాజులు అందరి దృష్టిలో పడ్డారు.
అయితే అనుకోకుండా శంకరాభరణం సినిమాకు వచ్చిన ఛాన్స్ తో సోమయాజులు రాత్రికి రాత్రే స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్నారు. నిజానికి ఈ సినిమా చేయడానికి సోమయాజులు అంగీకరించలేదు. ఈ సినిమా కోసం కొత్త నటుడు కావాలి. దాంతో పాటు అనుభవం కూడా ఉండాలి. అలా శంకరాభరణంలో శంకరశాస్త్రి పాత్రకోసం కళా తపస్వి కె విశ్వనాధ్ వెతుకుతుంటే ఓ మిత్రుని సలహాతో సోమయాజులు విషయం తెల్సింది.
అప్పటికే రారా క్రిష్నయ్య మూవీ ప్లాప్ అవ్వడంతో ఇక సినిమాలకు దూరంగానే ఉండాలని సోమయాజులు నిర్ణయించుకున్నారు. ఎలాగైనా సోమయాజులుని ఒప్పిచాలని చేసిన ప్రయత్నంలో భాగంగా తమ్ముడు జెవి రమణమూర్తి నచ్చజెప్పడంతో సోమయాజులు ఒప్పుకోక తప్పలేదు. నిజానికి అప్పటికి డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసున్న సోమయాజులు కు ఈ సినిమాతో అఖండ కీర్తి వస్తుందని అతికష్టం మీద ఒప్పించి మద్రాస్ కి రప్పించారు.
అలా వద్దు వద్దు అన్నప్పటికీ చివరకు నటించి,అందరూ అన్నట్టుగానే కీర్తి వచ్చింది. 1980ఫిబ్రవరి 2న విడుదలైన శంకరాభరణం,పాటలు ఇంటింటా మారోమోగిపోయాయి. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. ఈ కీర్తితో దర్పం రావడం సహజం. అలాగే సోమయాజులు విషయంలో జరిగింది. ఇక భజన పరులు చేరి మరింత నూరిపోశారు.
అందుకే ఆతర్వాత కన్యాశుల్కం నాటకంలో రామప్ప పంతులు పాత్ర పోషించడానికి సోమయాజులు ఒప్పుకోలేదు. నిజానికి ముందుగానే ఒప్పుకున్న నాటకం ఇది. రమణమూర్తి,సోమయాజులు కల్సి నటించాలి. కానీ సోమయాజులు చేయనని మొండికేశారు. ‘నాటకం కన్నా, పాత్ర కన్నా నటుడు గొప్పవాడు కాదని, నిజానికి ఏ పాత్ర ద్వారా గుర్తింపు పొందావో ఆ పాత్ర చేయనంటున్నావ్ ఇక జీవితంలో నీతో కల్సి నటించేది లేదు’అని రమణమూర్తి వెళ్లిపోయారు. అలా సొంత అన్నదమ్ములు 9 ఏళ్ళు ఇద్దరి మధ్యా రాకపోకలు, మాటలు లేకుండా పోయాయి.