ఆంధ్ర రాష్ట్రం కోసం దీక్ష చేసిన మొదటి వ్యక్తి శ్రీరాములేనా?
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండు 1920ల కంటే ముందు నుంచే బలంగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం లభించే నాటికే ఆంధ్ర రాష్ట్రం కోసం పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. మద్రాసు అసెంబ్లీలో ఈ విషయాన్ని ఆంధ్రా సభ్యులు కొందరు లేవనెత్తారు. పలువురు దీక్షలు కూడా చేశారు.. చేస్తున్నారు. అందులో ప్రధానమైనది స్వామి సీతారామ్‌గా ప్రచారం పొందిన గొల్లపూడి సీతారామ శాస్త్రిది. ఆంధ్ర జిల్లాల్లో పర్యటించి, తగినంత చైతన్యం వచ్చిందని భావించిన తర్వాత గుంటూరు జిల్లాలోని తన ఆశ్రమంలో 1951 ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబరు 20వ తేదీ వరకు నిరాహారదీక్ష చేశారు.
వినోబా భావే పిలుపుతో దీక్షను విరమించారు. తర్వాత 1952 మే 25వ తేదీ నుంచి మూడు వారాలపాటు మరోమారు దీక్ష చేసి, మరలా విరమించారు. ఢిల్లీలో దీక్ష చేయాలని భావిస్తున్నట్లు ఆ సందర్భంగా ప్రకటించారు. ఆ సమయంలోనే మద్రాసు సెక్రటేరియట్ ఎదుట రిలే సత్యాగ్రహ దీక్షలు ప్రారంభమయ్యాయి.పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19వ తేదీన బులుసు సాంబమూర్తి ఇంట్లో ఆమరణ దీక్షప్రారంభించారు.