Politics

నెహ్రూ గారి గురించి మీకు ఈ విషయాలు తెలుసా?నమ్మలేని నిజాలు

నెహ్రూ పూర్వీకులు కాశ్మీర్‌ నుంచి వచ్చి ఢిల్లీలో స్థిరపడ్డారు. వారి కుటుంబం ఢిల్లీలో ఒక కాలువ ఒడ్డున ఉండేది. హిందీలో కాలువను ‘నెహర్‌’ అంటారు. అలా వారికి నెహ్రూ అనే పేరు ఇంటిపేరుగా మారింది. నిజానికి వారి ఇంటి పేరు ‘కౌల్‌’.

* నెహ్రూ తల్లిదండ్రులు స్వరూపరాణి, వోతీలాల్‌. అలహాబాద్‌లో పేరు పొందిన న్యాయవాది వోతీలాల్‌ చాచాకు ఇద్దరు చెల్లెళ్లు… విజయలక్ష్మి, కృష్ణ. నెహ్రూ అలహాబాద్‌లో స్కూల్‌కి వెళ్లి చదివింది తక్కువ. ఇంటి దగ్గరకే మాష్టార్లు వచ్చి కొడుక్కి పాఠాలు చెప్పేలా ఏర్పాటుచేశారు వోతీలాల్‌. ఒక విదేశీ టీచర్‌ నెహ్రూకు సైన్సు, ఇంగ్లిష్‌ పాఠాలు బోధించేవారు. చాచాకు ఇష్టమైన సబ్జెక్టులు కూడా అవే. కొడుకు కోసం వోతీలాల్‌ ఇంట్లోనే సైన్సు ప్రయోగశాలను ఏర్పాటుచేశారు. 15 ఏళ్లపుడు నెహ్రూ చదువుకోసం ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ ఎనిమిదేళ్లు చదువుకొని న్యాయశాస్త్రంలో పట్టాతో స్వదేశం వచ్చారు. నెహ్రూకు 27వ ఏట కమల కౌల్‌తో వివాహమయింది.

* నెహ్రూకు ఒకే ఒక్క కుమార్తె. ఆమే ఇందిరాగాంధీ. స్వాతంత్య్రం కోసం నెహ్రూ పోరాటం చేసినపుడు ఆంగ్లేయులు ఆయన్ని ఎన్నోసార్లు జైల్లో పెట్టారు. దాంతో తన ముద్దుల కుమార్తె ఇందిరకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉండాల్సివచ్చేది. అందుకు నెహ్రూ ఎంతో బాధపడేవారు. ఇందిర తన దగ్గరే ఉంటే ఏమేం చెప్పాలనుకునేవారో వాటన్నిటినీ ఉత్తరాల్లో రాసేవారు. ఇందిర ఆ ఉత్తరాల్ని చదివి భద్రపరిచి తండ్రి చెప్పినట్టే నడుచుకునేవారు. ఆ ఉత్తరాల్ని ‘Letters from a father to his daughter’ పేరుతో పుస్తకంగా ముద్రించారు. అంటే మీరూ చదవొచ్చన్నమాట.

* నెహ్రూ కోటుపై ఎర్ర గులాబీ చూశారుగా! అది పెట్టుకోవడం ఆయనకు ఎలా అలవాటైందంటే… ఒకరోజు మీలాంటి ఓ చిన్నారి ఆయనకు గులాబీని బహుమతిగా ఇస్తే కోటుకు పెట్టుకున్నారు. అదిచూసి ఆనందంతో నవ్విన చిన్నారీ అరవిరిసిన గులాబీ ఆయనకు ఒక్కలాగే కన్పించాయట. తనకు అంత ఇష్టమైన పిల్లలగుర్తుగా ఆ తర్వాత నుంచి రోజూ కోటుపై గులాబీ పెట్టుకోవడం ఆయనకు అలవాటైందని చెబుతుంటారు. సెలవు రోజుల్లో నెహ్రూ పిల్లల్ని తన నివాసానికి పిలిచి మిఠాయిలు పంచేవారు. కబుర్లు చెప్పేవారు. పిల్లలు చాచాకు ఇష్టమైన గులాబీలను బహుమతిగా ఇచ్చేవారు.

* ఓసారి జపాన్‌కు చెందిన బాలలు ఏనుగు కావాలని చాచాకు ఉత్తరం రాశారు. వెంటనే ఆయన వారికొక ఏనుగును పంపించి, ‘భారతదేశంలోని పిల్లలందరి తరఫునా మీకు ఈ కానుకను పంపిస్తున్నా’ అని ఉత్తరం రాస్తే వారెంతో సంతోషించారట. ఆ ఏనుగు రెండు దేశాల మధ్య స్నేహాన్ని పెంచింది.

* పిల్లలంతా బడికి వెళ్లాలనేది చాచా కోరిక. ఓసారి బాలల సినిమా చూసిన చాచా అందులో నటించిన ఏడేళ్ల పాపాయిని మెచ్చుకుంటూ షేక్‌హ్యాండ్‌ ఇచ్చారు. అయితే ఆ పాపకి తిరిగి ‘థ్యాంక్స్‌’ చెప్పడం కూడా రాలేదు. దాంతో చాచాకు సందేహం వచ్చి ‘పాపను బడికి పంపడం లేదా’ అని వాళ్ల అమ్మను అడిగారు. లేదని చెప్పేసరికి, ఆమెను కోప్పడి, పాపను వెంటనే బడిలో చేర్పించమని చెప్పారు.

* ఓసారి ఢిల్లీలో స్కూల్‌ పిల్లలు ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. ప్రధాని నెహ్రూని కూడా ఆహ్వానించారు. ఆయన అక్కడ ఒక ఆట కూడా ఆడారు. గోడపైన తోకలేని ఏనుగు బొమ్మను అతికించారు పిల్లలు. దాన్ని దూరం నుంచి చూశాక కళ్లు మూసుకొని కాగితపు తోకను ఏనుగు బొమ్మకు అంటించాలి… అదీ గేమ్‌. నెహ్రూ కూడా గంతలు కట్టుకొని తోక అతికించడానికి ప్రయత్నించారు. కానీ అంగుళం దూరంలో అంటించారు. ఆ గేమ్‌ ఆడినందుకు అక్కడున్న పిల్లాడు రెండు అణాలు ఫీజు అడిగితే నెహ్రూ ముందు ఆశ్చర్యపోయినా, తరవాత సరదాగా నవ్వేశారట. తన సహాయకులనడిగి డబ్బు ఇప్పించుకొని ఫీజు చెల్లించారట.

ఇలా పిల్లలతో చాచాకు ఉన్న అనుబంధం గురించి ఎన్ని విషయాలైనా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఎంతో ఇష్టమైన, పిల్లలంటే ప్రాణమైన నెహ్రూ 1964లో కన్నుమూశారు. చిన్నారులపట్ల ఆయనకున్న ప్రేమానురాగాలను గుర్తుచేసుకోవడానికి ఆ సంవత్సరం నుంచి ఆయన పుట్టినరోజైన నవంబరు 14ను బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.మీకందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు…