KCR కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా?
ఎన్నికలంటే అన్ని విషయాలు పూసగుచ్చినట్లు బయటకు వచ్చేస్తాయి. వాడీవేడీ విమర్శలలో ఒకరి జాతకాలు ఒకరు చెప్పేస్తారు. ఇక నామినేషన్ దాఖలు సమయంలో వివరాలు అన్నీ దరఖాస్తులో వెల్లడించాల్సిందే. అందుకే కొన్ని దాగాలన్న దాగవు. సరిగ్గా తెలంగాణాలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల హంగామా చూస్తే, ఎవరికివారు టికెట్ల కేటాయింపు , టికెట్స్ రానివాళ్లు గొడవలు,రాద్ధాంతం,వచ్చినవాళ్లు మూహూర్తం చూసుకుని నామినేషన్స్ వేయడం ఇలా అంతటా కోలాహలమే. ముఖ్యంగా ముందస్తుకు రంగం సిద్ధం చేసిన టి ఆర్ ఎస్ పార్టీ అయితే నామినేషన్ల హడావిడిలో మునిగితేలుతోంది. సీఎం కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీకి బుధవారం నామినేషన్ వేశారు.
అయితే సెంటిమెంట్ ప్రకారం కోయినపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఆయన బాబాయ్ బాలకిషన్ రావు పాదాలకు నమస్కరించి నామినేషన్ దాఖలుకు రంగంలోకి దిగారు. నామినేషన్ తో పాటు ఆస్తులు,అప్పులు, పోలీసు కేసులకు సంబంధించి అఫడవిట్ దాఖలు చేసారు. ఈయనపై 64పోలీసు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 2కేసుల్లో సమన్లు అందుకున్నారు. ఆయన ఆస్తిని 22కోట్లుగా చూపించారు.
భార్య శోభా పేరిట 94లక్షల ఆస్తి ఉన్నట్లు చూపించారు. ఇక 2014లో 15కోట్లు ఆస్తులు ఉన్నట్లు చూపిన కేసీఆర్ ఇప్పుడు చూపించిన ప్రకారం 7కోట్ల రూపాయలు పెరిగాయి. ఇక ఆయనకు సొంత కారంటూ లేదు. ఇక భార్య పేరున 93వేలరూపాయల నగదు , రెండు కేజీల బంగారం ఉంది.
ఇక కేసీఆర్ కి మొత్తం 54ఎకరాల పొలం చూపించారు.
అందులో ఈ నాలుగేళ్ళ కాలంలో 17ఎకరాల భూమి కొనుగోలు చేస్తే, భార్య పేరున 6ఎకరాలు కొన్నట్లు చూపించారు. మీడియా, రియల్ ఎస్టేట్ రంగంలో తన ఆస్తులను ఆయన పెట్టుబడులుగా పెట్టినట్లు అర్ధం చేసుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణా బ్రాడ్ కాస్టింగ్ సంస్థలో 55లక్షలు,తెలంగాణా పబ్లికేషన్స్ లో 4కోట్లు పెట్టుబడులుగా చూపించారు.
ఇక కేసీఆర్ కి భారీగానే అప్పులున్నాయి. 2014లో 7కోట్ల 87లక్షల రూపాయల అప్పులుంటే,ఇప్పుడు 8కోట్లకు చేరాయి. కొడుకు కేటీఆర్ ,కోడలు శైలమ్మకు కొన్ని అప్పులు చెల్లించాల్సి ఉంది. కేటీఆర్ కి 88లక్షలు, శైలమ్మకి 24లక్షలు అప్పు చెల్లించాల్సి ఉంది.