తెలంగాణలో స్వతంత్రుల వలన లాభం ఎవరికో తెలుసా? టిఆర్ఎస్ లేదా కూటమి?
ముందస్తుగా వచ్చి పడ్డ తెలంగాణా ఎన్నికల్లో ప్రచారం తారాస్థాయికి చేరింది. ఎన్నిక తేదీ దగ్గర పడడంతో అగ్రనేతల ప్రచారాలు జోరందుకున్నాయి. టిఆర్ ఎస్ పార్టీని ఎదుర్కోడానికి , ఓట్లు చీలిపోకుండా ఉండడానికి ప్రజాకూటమి పేరిట కాంగ్రెస్,టిడిపి,టిజెఎస్,సిపిఐ జట్టుకట్టాయి. మరోపక్క బిజెపి , మజ్లీస్ పార్టీలు పోటీ పడుతున్నాయి. ఇక టికెట్లు రాలేకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలో దిగినవాళ్లు చాలాచోట్ల ఉన్నారు. ఇపుడు ఎవరు గెలుస్తారు అనేదానితో పాటు ఇండిపెండెంట్లు ఎవరికి కొమ్ము కాస్తారనే దానిపై కూడా చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ తోనే స్వతంత్రులు కలుస్తారన్న ప్రచారం జరుగుతోంది. కాదు టిఆర్ ఎస్ వెంట నడుస్తారని ఇలా రకరకాల ప్రచారం సాగుతోంది.
ఇంతకీ దీనికి అసలు కారణం లగడపాటి రాజ్ గోపాల్ సర్వే. ఎందుకంటే 10మంది ఇండిపెండెంట్లు గెలుస్తారని ఆయన సర్వేలో వెల్లడించారు. ఈ సర్వే రేపిన కలకలంతో కేసీఆర్ సీరియస్ గా స్పందించారు. నిజానికి ఇండిపెండెంట్స్ గెలవడం కొత్త కూడా కాదు. 1994లో అప్పటి టీడీపీ ప్రజా అనుకూలతను అంచనా వేయలేకపోవడంతో మిత్ర పక్షాలకు 43సీట్లు ఇచ్చింది. టిడిపి 251చోట్ల పోటీకి దిగింది. అయితే మిత్రులకు కేటాయించిన టీడీపీ రెబల్స్ చాలాచోట్ల బరిలో దిగి , అందులో 12మంది గెలిచారు. ఆతర్వాత అందులో ఎక్కువమంది టిడిపిలో కలిసిపోయారు.
ఇక 2004లో 11మంది ఇండిపెండెంట్స్ గెలిచారు. అప్పట్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ కి ఇందులో చాలామంది దగ్గరయ్యారు. ఈలెక్కన చూస్తే తెలంగాణలో 10మంది స్వతంత్రులు గెలుస్తున్నట్లు లగడపాటి చెప్పేస్తూ అందులో ఇద్దరి పేర్లు కూడా చెప్పసారు. ప్రధాన పార్టీలను కాదని స్వతంత్రులు గెలిచారంటే అది సామాన్య విషయం కాదని,దీన్నిబట్టి ప్రధాన పార్టీలపై ప్రజల్లో ఆసక్తి లేదని జనం లో చర్చ నడుస్తోంది. అయితే లగడపాటి సర్వేను టి ఆర్ ఎస్ తప్పుబడుతూ, పేర్లు వెల్లడించిన రెండుచోట్ల కూడా టి ఆర్ ఎస్ గెలుస్తుందని అంటున్నారు. బిజెపి కూడా లగడపాటి సర్వేను కొట్టిపారేస్తోంది.
కాగా లగడపాటి చెప్పిన రెండు పేర్లలో నారాయణపేటలో స్వతంత్ర అభ్యర్థి రెండో స్థానంలో ఉండగా, టి ఆర్ ఎస్ మొదటి స్థానంలో ఉందని టి ఆర్ ఎస్ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ప్రతిపక్షం వైపు ప్రజలు మొగ్గకుండా ఇండిపెండెంట్ పై మొగ్గడం సహజమని అంటున్నారు. టికెట్ల కేటాయింపు,స్థానిక సమీకరణాలు కారణంగా ఫలితం చెప్పలేని విధంగా ఉంటుందని అంటున్నారు. 10మంది స్వతంత్రులు గెలిచినా, ఇంకా 110సీట్లు ఉన్నాయని,హంగ్ కి ఛాన్స్ లేదని కూడా వాదిస్తున్నారు.
ఒకవేళ హంగ్ అంటూ ఏర్పడితే, 10మంది స్వతంత్రులు అధికారానికి చేరువ అవుతారా,లేక తమ గెలుపునకు సహకరించిన నేతల మాటలకు విలువ నిస్తారా అనే టాక్ కూడా నడుస్తోంది. అయితే లగడపాటి సర్వే వెనుక కాంగ్రెస్ హస్తం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. మొత్తానికి లగడపాటి సర్వే మరొకటి ఉంటుందా,లేక దీంతోనే ధీమాగా సరిపెడతారా అన్నది కూడా చర్చ సాగుతోంది.