Politics

తెలంగాణ ఎన్నికల్లో లోకేష్ ని దూరం పెట్టడానికి కారణం ఏంటో తెలుసా?

టిడిపిలో కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి పార్టీని కొత్త పుంతలు తొక్కించిన మంత్రి నారా లోకేష్ ఇప్పుడు తెలంగాణా ఎన్నికలకు దూరంగా ఉంటున్నాడు. నిజానికి పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే అయినప్పటికీ ఇప్పుడు అమరావతికి పరిమితం అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణాలో టిడిపి ఓటమి చెందడంతో ఆతర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోకేష్ దూసుకుపోయాడు. అన్నీ తానై ప్రచారం భుజాన వేసుకున్నాడు. కానీ ఇప్పుడు కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో కనపడకపోవడం వెనుక ఏదైనా స్టాటజీ ఉందా అని అంటున్నారు.

ఏపీలో మాదిరిగా తెలంగాణాలో కూడా నాయకులతో లోకేష్ టచ్ లోనే ఉండేవారు. శిక్షణ కార్యక్రమాల్లో కూడా పాల్గొని,కొన్ని సూచనలు చేసేవారు. ఉన్నట్టుండి ఇప్పుడు ఎన్నికల సమయంలో దూరం కావడం చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి యువనేత కాంగ్రెస్ గూటికి వెళ్లిపోవడంతో లోకేష్ కి తగిన సూచనలు ఇచ్చేవాళ్ళు తెలంగాణలో లేకపోవడం,తెలంగాణా పాలిటిక్స్ పై చంద్రబాబుకి మాత్రమే అవగాహన ఉండడం వంటి కారణాల వలన లోకేష్ తెలంగాణ ఎన్నికలకు దూరం పెట్టినట్లు చెబుతున్నారు.

ఇక మరో వాదన కూడా వినిపిస్తోంది. తెలంగాణలో కొత్తగా వచ్చేది,పోయేది లేదని,అందుకే ఏపీలో పార్టీపై,ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించడం వలన ఎంతో ప్రయోజనం ఉంటుందని లోకేష్ భావిస్తున్నారని పార్టీ వర్గాల అభిప్రాయం.ఇక కీలకమైన ఓటుకు నోటు కేసులో లోకేష్ పాత్ర ఉందని,మద్దతు కూడగట్టడం కోసం చేసిన ప్రయత్నాల వలన కేసులో పేరు వినిపిస్తోందని,ఇలాంటి చేదు అనుభవాల దృష్ట్యా అక్కడ కనిపించకుండా మంచిదన్న ఉద్దేశ్యంలో ఉన్నట్టు మరో వాదన వినిపిస్తోంది. ఇక కేసీఆర్ కొడుకు కేటీఆర్ పంచాయితీ రాజ్,ఐటి శాఖల మంత్రిగా వ్యవహరించేటప్పుడు ఏపీలో లోకేష్ కూడా అవే శాఖలు తీసుకున్నాడు.

అయితే తెలంగాణాలో అర్బన్ ప్రాంతాలు ఎక్కువ కావడంతో పట్టణాభివృద్ధి శాఖకు కేటీఆర్ మారినా, ఏపీలో గ్రామాలు ఎక్కువ కనుక లోకేష్ పంచాయితీ రాజ్ శాఖలోనే కొనసాగుతున్నారు. ఇక కేటీఆర్ ఉద్యమాలలో పాల్గొని రావడం కల్సి వచ్చే అంశం. పైగా మంచి వక్త కూడా. లోకేష్ ఈవిషయంలో కొంచెం ఇబ్బందే. వారసుల పోలిక చూస్తే లోకేష్ కి వచ్చే ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని లోకేష్ తెలంగాణా ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు వినిపిస్తోంది.