Politics

తెలంగాణా పోరుపై ఏపీలోనూ ఆసక్తి – సుహాసిని గెలుస్తుందా… లేదా? జోరుగా పందాలు కాస్తున్నారు ఏమవుతుందో?

ఇంకా సమయం ఉన్నా సరే ముందస్తు ఎన్నికలకు తెరతీసిన టి ఆర్ ఎస్ ప్రభుత్వం రద్దుచేసి ఎన్నికలకు వెళ్లడంతో శుక్రవారం 119 నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. అసలు తెలంగాణా ఫలితాలపై ముందు నుంచీ ఏపీలో ఆసక్తి పెరిగిపోతూ వస్తోంది. దీనికి కారణం కాంగ్రెస్ తో టిడిపి జతకట్టి వ్యూహ రచన చేయడమే. ఎట్టి పరిస్థితుల్లో టి ఆర్ ఎస్ రాకూడదని ఎపి సీఎం చంద్రబాబు ఎత్తులు వేస్తూ వచ్చారు. అందుకే ప్రజాకూటమి రూపు దాల్చింది. ఇక హైదరాబాద్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

టిడిపి నుంచి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీలో ఉండగా ఇక్కడ రసవత్తరంగా మారింది. రేవంత్ గెలుపు మీదే కాదు అతనికి వచ్చే మెజార్టీ మీద బెట్టింగ్ లు కాస్తున్నారు. అలాగే చాలా నియోజక వర్గాల్లో గెలుపు ఓటములపై పందాలు కాస్తున్నారు. ఇక సర్వేలు కూడా భిన్నంగా ఉన్నాయి. కొన్ని సర్వేలు టీ ఆర్ ఎస్ కి అనుకూలంగా ఉంటె, మరికొన్ని ప్రజా కూటమికి అనుకూలంగా ఉన్నాయని తెలుస్తున్నాయి.

ఇక సందెట్లో సడేమియా అన్నట్లు లగడపాటి రాజగోపాల్ సర్వే కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. కాగా హైదరా బాద్ ఓటర్లు ఎవరివైపు మొగ్గు చూపారో తెలియడం లేదు. ఇక కూకట్ పల్లి నుంచి పోటీకి దిగిన నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని గెలుపు మీద పందాలు జోరందుకున్నాయి. గడిచిన రెండు రోజులుగా పోలీస్ దాడుల కారణంగా సుహాసిని కి సపోర్ట్ చేసేవాళ్ళు పెద్దగా బయటకు రాలేదని,దీంతో ఆమె ఓటమి ఖాయమని సాయంత్రం దాకా పందాలు జరిగితే, రాత్రయ్యేసరికి సుహాసిని అనుకూలంగా పందాలు ఊపందుకున్నాయి. ఆమె గెలుపు సునాయాసమని అంటున్నారు. ఈనెల 11న లెక్కింపు వరకూ ఉత్కంఠ తప్పదు.