అలీ పొలిటికల్ ఎంట్రీ ఎందుకు చేస్తున్నాడో తెలుసా?
రాజకీయాల్లోకి సినీ నటుల ప్రవేశం కొత్తేమి కాదు. చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. ఇందులో కొందరు ప్రజాప్రతినిధులు అయ్యారు. మరికొందరు ఓటమి చెందారు. కొందరు రాజకీయాలను వదిలేసే మళ్ళీ సినిమాల్లో నిమగ్నమయ్యారు. ఇక కొత్తగా స్టార్ కమెడియన్ అలీ రాజకీయ ఎంట్రీ గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనికి కారణం అలీ తాజాగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని కలవడమే. జగన్ శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని అలీ కలవడం,దాదాపు గంటకు పైగా ఏకాంతంగా చర్చలు జరపడం చూస్తుంటే,ఇక ఎంట్రీ ఇవ్వడమే తరువాయి అంటున్నారు.
జనవరి 9న పాదయాత్ర ముగింపు సందర్బంగా ఇచ్ఛాపురంలో నిర్వహించబోయే జగన్ బహిరంగ సభలో అలీ వైసిపి తీర్ధం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓ పక్క సినిమాల్లో మరోపక్క టివి షోల్లో బిజీ బిజీగా ఉంటున్న అలీ సడన్ గా రాజకీయాలేమిటి అనుకుంటున్నారా? నిజానికి 2010నుంచే అలీ రాజకీయ రంగ ప్రవేశం పై ఆసక్తి కనబరుస్తున్నాడు. టిడిపికి స్ట్రాంగ్ సపోర్ట్ గా ఉండేవాడు.
అందుకే మహానాడు కమిటీలో అలీ కి చోటు కూడా కల్పించారు. బాబు మోహన్, ఏవీఎస్,వేణుమాధవ్ వంటి వాళ్ళు అలీ కమిటీలో ఉండేవారు. గత ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నుంచి పోటీ చేయించాలని టిడిపి భావించినట్లు వార్తలు వచ్చాయి. అయితే సినిమాల్లో బిజీ కారణంగా అలీ నిరాకరించాడు. ఆతర్వాత నుంచి టిడిపితో అలీ పెద్దగా టచ్ లో లేడు. అలాగే టీడీపీ కూడా అలీతో క్లోజ్ నెస్ మెయిన్ టైన్ చేయలేదు. దీంతో జనసేన పార్టీలో చేరాలని అలీ అనుకున్నాడట.
ఎందుకంటే పవన్ కళ్యాణ్ తో ఆలీకి గల సంబంధం అందరికీ తెలిసిందే. అయితే తన సొంతూరు రాజమండ్రి నుంచి పోటీ చేయడానికి జనసేన నుంచి హామీ లభించకపోవడం,జనసేన నుంచి రాజమండ్రి కి ఎక్కువ అభ్యర్థులు పోటీ పడుతుండడంతో పవన్ కళ్యాణ్ ఏమీ చెప్పలేకపోవడం వంటి కారణాలతో వైసిపి వైపు అడుగులు వేస్తున్నట్లు తెల్సింది.
పేదరికంలో పుట్టిన ఆలీకి పేదవాళ్లంటే ఎక్కువ మమకారం. అలీ తండ్రి ఓ టైలర్ గా పనిచేసేవారు. తన సంపాదనలో కొంత మొత్తాన్ని పేదలకోసం అలీ వెచ్చిస్తుంటాడు. ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువమందికి సాయం చేయవచ్చనే ఉద్దేశ్యంతో పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినిమా రంగంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి,స్టార్ కమెడియన్ గా రాణిస్తూ హీరోగా కూడా సక్సెస్ సాధించిన అలీ రాజకీయాల్లో సక్సెస్ కొడతాడా, లేదా అనే వేచి చూడాలి.