‘ఫెడరల్ ఫ్రంట్’దిశగా జగన్ అడుగులు – కేటీఆర్ బృందంతో భేటీ
వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఓపక్క చంద్రబాబు కాంగ్రెస్ తో సహా పలు పార్టీలను కల్సి బిజెపి వ్యతిరేక శక్తులను ఏకం చేయాలనీ చూస్తుంటే,మరోపక్క ‘ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ద్వారా కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు రావాలని టి ఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో చర్చలు జరుపుతున్న కేసీఆర్ తాజాగా తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడిన టీమ్ ని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తో చర్చలు జరపమని బుధవారం పంపించారు. జగన్మోహన్‌రెడ్డితో కేటీఆర్, వినోద్ కుమార్,శ్రవణ్ కుమార్ రెడ్డి,ఆళ్ళ రాజేశ్వర రెడ్డి, తదితరులు భేటీ అయ్యారు. జగన్ తో చర్చలు జరిపారు.
‘ఫెడరల్ ఫ్రంట్ కోసం ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ,ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్,యుపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో కల్సి కేసరి చర్చలు జరిపారు. ఇక యుపిఎ లో గానీ, ఎన్డీయేలో గానీ లేని జగన్ తో కూడా చర్చలు జరపాలని కేసీఆర్ నిర్ణయించారు. ఏపీలో బిజెపికి ఎదురుగాలి వీచడం వలన జగన్ ‘ఫెడరల్ ఫ్రంట్ వైపు మొగ్గు చూపుతారని అంటున్నారు. ఎందుకంటే యుపిఎ కూటమితో చంద్రబాబు జట్టుకట్టడం కూడా ‘ఫెడరల్ ఫ్రంట్ వైపు జగన్ అడుగులు వేయడానికి మార్గం ఏర్పడిందన్న మాట వినిపిస్తోంది.
ఇక జగన్ తో చర్చల అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు ఫోన్ చేసి మాట్లాడాం. ఆయన సానుకూలంగా స్పందించడంతో వచ్చి వారి బృందాన్ని కలిసి అన్ని విషయాలను పంచుకున్నాం. తప్పకుండా ఒకే ఆలోచనాధోరణి ఉన్న నేతలందరూ ఒకే వేదికపై వస్తారని ఆశిస్తున్నాం’అని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేసీఆర్, కేశవరావు, కవిత సహా మా పార్టీ నేతలందరం స్పష్టంగా చెప్పాం.’’ అని కేటీఆర్ అన్నారు.