Business

ఆస్తులు సమానంగా పంచుకున్న… అన్న ఆకాశానికి…తమ్ముడు పాతాళానికి….ఎందుకిలా?

ఎదగడం ఎంత కష్టమో నిలబడడం కూడా అంతే కష్టం. ఇందుకు అంబానీ సోదరుల ప్రయాణమే నిదర్శనం. ధీరూభాయ్ అంబానీ ఆస్తుల విలువను వందరెట్లు పెంచిన కొడుకులు ముఖేష్,అనిల్ అంబానీల మధ్య గొడవతో వ్యాపారాలు రెండుగా చీలిపోయాయి. అయితే ఇందులో ముఖేష్ బాగా రాణించగా, అనిల్ అంబానీ నష్టాలలో కూరుకుపోయాడు. దీనికి కారణం ఏమిటో ఒకసారి చూద్దాం, చిన్న పెట్రోల్ బంకులో చిరుద్యోగిగా చేరి,ఫుట్ బాల్ స్టేడియం లో ఇన్వెస్టర్స్ మీట్ పెట్టె స్థాయికి ఎదిగిన వ్యక్తి ధీరూభాయ్ అంబానీ. దేశంలో లక్షలాది మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాల కల్పనలో రాణించిన ధీరూభాయ్ హాయంలో సంస్థ పది మెట్లు ఎక్కితే, కొడుకుల హయాంలో వందరెట్లు ఎగబాకింది. అయితే కొడుకులిద్దరూ ఘర్షణ వలన పరిస్థితి మారిపోయింది. 2002లో ఎలాంటి వీలునామా రాయకుండా ధీరూభాయ్ అంబానీ తనువు చాలించాడు.

దీంతో అప్పటిదాకా అతిపెద్ద సామ్రాజ్యంగా గల రిలయన్స్ కి ఎవరు సారధ్యం వహిస్తారన్న చర్చ నడిచింది. మొదట్లో ముఖేష్,అనిల్ మధ్య సత్సబంధాలు ఉండేవి. దాంతో ముఖేష్ మితభాషి కావడం వలన ఆస్తులను చూస్తూ, వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టాడు. అవుట్ స్పోకెన్ అయిన తమ్ముడు అనిల్ సంప్రదింపులు,ఇతరదేశాల్లో పనులు చక్కబెట్టడం వంటివి చేసేవాడు. అదేసమయంలో తండ్రి మరణంతో మొత్తం తన కంట్రోల్ లో ఉంచుకోవాలని దూకుడుగా వ్యవహరించాడని టాక్ ఉండేది.

ఇక ఇద్దరి మధ్యా గొడవలు తారాస్థాయికి చేరడంతో కోకిలా బెన్ సహా వాళ్ళ ఫామిలీ ఆధ్యాత్మిక గురువు శ్రీనాధ్ సమక్షంలో సయోధ్య కుదిరింది. ఐసిఐసి ఐ మాజీ ఎండి కామత్ సారధ్యంలో 2005లో లక్షకోట్లు ఉండే రిలయన్స్ ఆస్థి పంపకాలు జరిగాయి. పెట్రోలియం బిజినెస్ లో గల రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇండియన్ పెట్ కేమ్ బిజినెస్ ని ముఖేష్ తీసుకుంటే,టెలికం,విధ్యుత్,కేపిటల్ వ్యాపారాలను అనిల్ తీసుకున్నాడు.

ఎవరూ కూడా తమ వ్యాపారానికి అడ్డురాకూడని, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకోవాలని కూడా అంబానీ సోదరులు ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో మంచి భూమ్ లో టెలికం రంగం ఉండడంతో అనిల్ దేశంలో ధనికుల జాబితాలో నిలిచాడు. అయితే ముఖేష్ దూకుడు తగ్గించి, పెట్రోలియం,టెక్స్టైల్ వ్యాపారాల్లో దృష్టి పెట్టారు. దాంతో బాగా స్థిరపడుతూ వస్తే, అనిల్ మాత్రం సంబంధం లేని వ్యాపారాల్లో అంటే ఇన్ఫరా, కమ్యూనికేషన్స్,పవర్,కేపిటల్, హోమ్ ఫైనాన్స్, నావెల్ వంటి వాటిలో తలదూర్చి, విస్తరించారు.

2008 మాంద్యం సమయంలో సీన్ రివర్స్ అయింది. టెలికం మొత్తం దెబ్బతినేసింది. ఆవిధంగా అనిల్ చేపట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ నష్టాల బాట పట్టాయి. ఎప్పుడూ జనంలో ఉండాలనే తాపత్రయంతో విలాసాలకు పోయాడు. మరోవైపు ముఖేష్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వంటి రంగాల్లో దూసుకుపోతూ వస్తున్నారు. సక్సెస్ కోసం ముఖేష్ సాఫీగా నడిచాడు.

ఇద్దరి మధ్యా ఆస్తుల వ్యత్సాసం మూడు లక్షల కోట్లకు చేరింది. ముఖేష్ ఆస్థి 2.7లక్షల కోట్లు కాగా,అనిల్ 13వేల కోట్లకు పడిపోయింది. 13ఏళ్ళ క్రితం 50వేల కోట్ల బాలన్స్ షీట్ ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయింది. ఇక కొన్ని సంస్థల దగ్గర తీసుకున్న రుణాలు కూడా చెల్లించలేని గడ్డు పరిస్థితి దాపురించింది. ఇక తన టెలికం వ్యాపారాన్ని ముకేశ్ కి అమ్మేసి,బయటపడాలని అనిల్ భావిస్తున్నారట. ఇలా ఒకరు విజయాన్ని దరిచేర్చుకుంటే, మరొకరు అపజయాన్ని మూటగట్టుకున్నారు.