నాగబాబు డైరెక్ట్ ఎటాక్ వెనుక అసలు కారణం తేలిపోయింది
సినిమా వాళ్ళు సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు,పెట్టె పోస్టులు సంచలనం కల్గిస్తాయి. సెలబ్రిటీలు కనుక ఆ మాత్రం సంచలనం ఉంటుంది. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్స్ ద్వారా నిత్యం వార్తల్లో ఉంటూ సంచలనం కల్గిస్తాడు. రామ్ ఏం పోస్ట్ పెడతాడా అని అందరూ ఎదురుచూస్తుంటారు. ఇక ఇప్పుడు యూట్యూబ్ ద్వారా నాగబాబు సంచలనం క్రియేట్ చేస్తున్నాడు. మెగా బ్రదర్స్ లో నాగబాబు శైలి భిన్నంగా ఉంటుంది. తాను చెప్పాలనుకున్నది ఎక్కడా భయపడకుండా, మొహమాట పడకుండా సూటిగా సుత్తిలేకుండా నాగబాబు చెప్పేస్తాడు.

యూట్యూబ్ ద్వారా విషయాలను తేటతెల్లం చేసేస్తాడు. నాగబాబు నిర్వహించే యూట్యూబ్ ఛానల్ ఆపార్టీ ఈపార్టీ అని లేకుండా,వాళ్ళు వీళ్ళు అని లేకుండా డైరెక్ట్ ఎటాక్ ఇస్తున్నారు. అది రాజకీయం కావచ్చు, సామాజికం కావచ్చు,మరొకటి కావచ్చు దానిపై తనదైన శైలిలో స్పందిస్తూ వ్యంగంగా వ్యాఖ్యానం చేస్తూ నాగబాబు బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే టిడిపి తిట్టినపుడు వైసిపి,అలాగే వైసిపిని తిడితే టిడిపి చంకలు గుద్దుకుంటున్నాయి. అయితే దీనివలన పెద్దగా ఇబ్బంది రాకుండా ఉంటున్నా, ఇన్ డైరెక్ట్ గా జనసేనకు లాభం చేకూర్చేలా ఉందని అంటున్నారు.

కాగా ఇప్పటివరకూ ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్న నాగబాబు సడన్ గా టిడిపి అనుకూల మీడియా మీద దాడికి దిగాడు. ఒక ఛానల్ ని విమర్శిస్తూ చిడతలు పెట్టి భజన చేస్తున్నట్లు వీడియో పోస్ట్ చేసాడు. దావోస్ సదస్సుకి వెళ్లిన లోకేష్ ని పొగిడేస్తూ ఓ ఛానల్ ప్రసారం చేసిన కథనం ప్రదర్శిస్తూ, దాన్ని చూస్తూ నాగబాబు చిడతలు వాయిస్తూ సైటైర్లు వేయడం బాగా ఆకట్టుకుంటోంది. ఆ ఛానల్ చంద్రబాబుకి,లోకేష్ కి భజన చేస్తోందని పరోక్షంగా చెప్పేసాడు.

