Politics

రోజా మళ్ళీ నగరిలో గెలుస్తుందా? లేదా? పరిస్థితి ఏమిటి?

మరో 15 రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటన వచ్చేస్తుందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటీకే ఆయా పార్టీలు తమ గెలుపు కోసం కసరత్తు చేస్తూ తమ తమ వ్యూహాలు అమలుచేయడం మొదలెట్టాయి. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైకాపా,కొత్తగా రంగంలో దిగననున్న జనసేన ఈ మూడు పార్టీల నడుమ రసవత్తర పోరుకి రంగం సిద్ధం అవుతుందని చెప్పవచ్చు. ఎన్నికల సర్వేలు కూడా మొదలయ్యాయి. అయితే ఎవరు గెలుస్తారో, ఏ పార్టీ అందలం ఎక్కుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఆయా నియోజకవర్గాల స్థాయిలో సర్వేలు జోరందుకున్నాయి.

ఇక వైకాపా తరపున ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న నటి రోజా మళ్ళీ గెలుస్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చిత్తూరు జిల్లా నగరి నుంచి గత ఎన్నికల్లో టిడిపి సీనియర్ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు మీద పోటీచేసి గెలిచిన రోజా అసెంబ్లీ లోపలా, బయటా ఫైర్ బ్రాండ్ గా మారింది. దీంతో టిడిపి నేతలకు కునుకు లేకుండా చేస్తున్న రోజా నియోజక వర్గంపై అధికార టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

ప్రత్యేకించి కొన్ని నియోజక వర్గాల్లో టిడిపి దృష్టి పెడుతోంది. అందులో నగరి ఒకటి. గత ఎన్నికల్లో రోజాపై పోటీ చేసిన ముద్దుకృష్ణమ నాయుడు మరణించడంతో బలమైన అభ్యర్థి వేటలో టీడీపీ ఉంది. ఎందుకంటే ముద్దుకృష్ణమ కొడుకులిద్దరూ రాజకీయ వారసత్వం కోసం పోటీ పడగా, వారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం ద్వారా చంద్రబాబు వ్యూహంగా వ్యవహరించారు.

నిజానికి రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం,ఆమె మాటలు వినడానికి కూడా అసెంబ్లీలో ఛాన్స్ ఇవ్వకుండా చేయడం వంటి వాటిని అమలు చేసింది. ఇక ఈసారి ఎలాగైనా సరే, రోజాపై అధికార టీడీపీ అభ్యర్థి గెలవాలన్న వ్యూహంతో ఆపార్టీ కసరత్తు చేస్తోంది. తనను అసెంబ్లీలో టార్గెట్ చేసి వేధించారని రోజా ఆరోపిస్తూ నియోజకవర్గంలో మళ్ళీ గెలవడానికి అవసరమైన సరంజామా సిద్ధం చేసుకుంటోంది.
Roja – MLA from Nagari Constituency
నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్న రోజా మరోసారి గెలవడం ఖాయమన్న మాట వినిపిస్తోంది. సర్వేలు కూడా ఇదే చెబుతున్నాయి. వైకాపా 53 శాతం,టిడిపి 46శాతం,ఇతరులు ఒకశాతం ఓట్లు తెచ్చుకుంటారని సర్వే చెప్పడం వైసిపిలో జోష్ ని పెంచుతున్నాయి. అయితే టిడిపి మాత్రం ఇప్పటివరకూ అభ్యర్థి కోసం పూర్తి కసరత్తు చేయలేదని అంటున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.