Politics

రాజకీయాల్లో ఈ నటీనటులు నిలబడేనా ?

రాజకీయాల్లోకి సినీ నటులు రావడం ఎప్పటినుంచో కొనసాగుతోంది. స్టార్ హీరోలే కాదు హీరోయిన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు,ఇలా అందరూ రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. ఇక కొందరు హీరోలు పార్టీలు పెట్టి అధికారం తెచ్చుకుంటే,మరికొందరు ఫెయిలయ్యారు. దక్షిణాది నుంచి ఎన్టీఆర్, ఎమ్జీఆర్,జయ లలిత వంటి వారు సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రులుగా కూడా తమ సత్తా చాటారు. వాళ్ల బాటలోనే చాలా మంది నటీనటులు సినీ రంగంలో ఒక వెలుగు వెలిగాక రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.అసలు భారతీయ సినిమా రంగంలో రాజకీయాల్లో ప్రవేశించి 1967లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి నాలుగో లోక్‌సభకు జగ్గయ్య ఎన్నికయ్యారు.

భారత దేశంలో ఒక నటుడు పార్లమెంటు సభ్యుడు కావడం ఆయనతోనే మొదలైంది. ఇక ఎన్టీఆర్ రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎంతో మంది తారలు.. రాజకీయాల్లో ప్రవేశించారు. రావు గోపాల్ రావు, తెలుగు దేశం పార్టీ తరుపున రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటులో అడుగుపెట్టారు. సినీ నటి శారద, జయప్రద పార్లమెంటుకు ఎన్నికయ్యారు. శారద చీరాల నుంచి ల లోకసభకు ఎన్నికైతే, జయప్రద టిడిపి నుంచి రాజ్యసభ సభ్యరాలిగా పనిచేసి, ఆ తర్వాత ఆమె సమాజ్ వాదీ పార్టీ నుంచి యుపిలో రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.

మరోవైపు సీనియర్ నటుడు సత్యనారాయణ కూడా 1996లో మచిలి పట్నం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా కాంగ్రెస్ తరుపున ఏలూరు నుంచి1989లో లోక్‌సభకు పోటీ చేసి గెలిచారు. 1991లో ఓడిపోయారు. కృష్ణ సతీమణి విజయ నిర్మలతో పాటు నరేష్ కూడా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకుని ఓడిపోయారు. అలాగే నటుడు కృష్ణంరాజు కూడా నర్సాపురం, కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొందడమే కాదు కేంద్రంలో మంత్రిగా పనిచేసిన మొదటి నటుడిగా రికార్డులకు ఎక్కాడు.

ఆ తర్వాత తెలుగు దేశం నుంచి మోహన్ బాబు.. రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. ఇక విజయశాంతి కూడా బీజేపీ,తల్లి తెలంగాణ, టీఆర్ఎస్ పార్టీలో సేవలు అందించారు.టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాస రావు బీజేపీ తరుపున ఎమ్మెల్యేగా పనిచేసారు. ఆయన తోటి నటుడు బాబు మోహన్ కూడా ఎమ్మెల్యేగా,మంత్రిగా సేవలందించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యంతో పార్టీతో రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసారు. మెగాస్టార్ దారిలో తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి, ఇపుడు భీమవరం, గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరో మెగా బ్రదర్ నాగబాబు కూడా నర్సాపురం నుంచి లోక్‌సభకు జనసేన అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. అటు బాలకృష్ణ కూడా రెండో సారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అంతకు ముందు ఆయన అన్న హరికృష్ణ..ఇదే నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా సేవలు అందించారు. జయసుధ, సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గి,ఆతర్వాత ఓడిపోయారు. పోసాని కృష్ణమురళి,30 ఇయర్స్ పృథ్వీ,రాజశేఖర్ జీవిత దంపతులు రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. రోజా కూడా వైసీపీ తరుపున నగరి నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికై మరోసారి పోటీచేస్తున్నారు.

ఉత్తరాదిలో కూడా ఎక్కువగా ఉంది. ఇప్పటికే దేవానంద్, అమితాబ్ బచ్చన్, రాజేష్ ఖన్నా, సునీల్ దత్, వినోద్ ఖన్నా, శతృఘ్న సిన్హా, గోవిందా, జయ బచ్చన్, రేఖ, హేమా మాలిని, స్మృతి ఇరానీ, నగ్మా వంటి నటీ నటులు రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.దేవానంద్ ఎమర్జెన్సీ సమయంలో ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. ప్రస్తుత రాజకీయాల్లో బీజేపీకి ఎక్కువగా స్టార్స్ సపోర్ట్ ఉంది.