Politics

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ఆస్తులు ఉన్న రాజకీయ నాయకులు వీరే

దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలతో పాటు ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల వేడి రాజుకుంది. దేశంలో తొలివిడత పోలింగ్ ఏపీలో జరగడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. నామినేషన్స్ దాఖలు ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పటీకే అధికార తెలుగుదేశం,విపక్ష వైసిపి, జనసేన పార్టీల అభ్యర్థులు నామినేషన్స్ వేసేసారు. ఇక ప్రచార పర్వం లోకి దూకడానికి అన్ని పార్టీలు రంగం సిద్ధం చేసుకున్నాయి. స్టార్ కంపైనర్స్ లిస్ట్ కూడా సిద్ధం చేసేసారు. తెలంగాణలో కూడా లోక సభ ఎన్నికలు తోలి విడతలోనే జరుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఏప్రియల్ 11వ తేదీ పోలింగ్ జరుగనుంది.

నామినేషన్స్ లో భాగంగా కుప్పం నుంచి మళ్ళీ సీఎం చంద్రబాబు నామినేషన్ వేయగా, పులివెందుల నుంచి ప్రతిపక్ష నేత జగన్ నామినేషన్ వేశారు. ఇక భీమవరం,గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ నామినేషన్ వేసారు. పలువురు మంత్రులు,పృముఖులు కూడా నామినేషన్స్ వేసినవారిలో ఉన్నారు. అలాగే తెలంగాణ నుంచి పిసిసి చీఫ్ ఉత్తమ్, విశ్వేశ్వర రెడ్డి , ఇతర ముఖ్య నేతలు ఉన్నారు. అయితే నామినేషన్స్ తో పాటు అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు వెల్లడించాలి. దీంతో చాలామంది ఆర్ధికంగా బలంగా ఉన్నవాళ్లేనని తేలిపోయింది.

ఆస్తుల విషయంలో తెలంగాణా నుంచి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి 895కోట్ల విలువైన ఆస్తులతో అందరికన్నా అగ్రభాగాన ఉన్నారు. ఇక ఏపీలో 650కోట్లతో మంత్రి నారాయణ అగ్రస్థానంలో నిలిచారు. వైఎస్ జగన్ తన ఆస్తులు 330కోట్లుగా చూపించారు. అలాగే తనపై గల కేసుల వివరాలు చేర్చారు. 2014తో పోలిస్తే జగన్ ఆస్తుల విలువ తగ్గినట్లు తెలుస్తోంది.

ఇక నరసాపురం వైస్సార్ సిపి అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు324కోట్లుగా ఆఫేడివిట్ లో పేర్కొన్నారు. ఇక గుంటూరు టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ఆస్తులు 266కోట్లుగా చూపించారు. ఇక విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో గల బాలయ్య రెండో అల్లుడు భరత్ ఆస్తుల విలువ 200కోట్లు ఉన్నట్లు అఫడవిట్ లో పేర్కొన్నారు.