Movies

క్రికెటర్ అవుదామనుకున్న రానా ఎందుకు అవ్వలేదో తెలుసా?

లీడర్ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి, ఒక్కో మెట్టు ఎక్కుతూ బాహుబలి సినిమాలతో దేశవ్యాప్తంగా ఇమేజ్ తెచ్చుకున్న తెలుగు నటుడు రానా. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు మనవడిగా తెల్సిన రానా తనకంటూ సొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఏ రంగంలో అడుగుపెట్టినా దుమ్ముదులుపుతాడన్నది ఆయన అభిమానుల మాట. నిజానికి రానాను తండ్రి దగ్గుబాటి సురేశ్ బాబు క్రికెటర్ ను చేయాలని కలలు కన్నా డు. కానీ అది నెరవేరలేదు. అందుకు కారణమేంటో సురేశ్ బాబే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రానాకు చిన్నప్పటి నుంచి ఒక కన్ను కనిపించదని, అందుకే ఆయన క్రికెటర్ కాలేకపోయారని చెప్పారు.

ఇంకా సురేష్ బాబు మాటల్లో .. రానా రెండు కళ్లలో ఒకదానికి సమస్య ఉన్నప్పడు చిన్న తనంలోనే   గుర్తించారు. ఆ కన్ను పనిచేయకపోవడంతో దాని స్థానంలో మరో కన్ను అమర్చారు. కానీ ఆ కంటికీ చూపు లేదు. అలా ఒక కన్ను పనిచేయకపోవడంతో కొడుకును స్పోర్ట్స్ మన్ ని చేయాలన్న సురేశ్ బాబు ఆశ నెరవేరలేదు. చిన్నప్పటి నుంచి తనకు క్రీడలంటే చాలా ఇష్టమని.. అందుకే రానాను స్పోర్ట్స్ మ్యాన్ చేయాలని ఆశించానని సురేశ్ బాబు చెప్పారు. అయితే ముందు రానాను ఆర్చరీలో చేర్చగా, అతను బాణాన్ని గురి చూసి కొట్టలేకపోయాడన్నాడు. ఆ తర్వాత క్రికెట్ లో చేరిస్తే బంతిని క్యాచ్ చేయడంలో ఇబ్బంది ఎదురైందన్నాడు. ఆ సమయంలో పరీక్షలు చేయిస్తే కంటి సమస్య ఉందని తెలిసిందన్నాడు.

చేసేది లేక ఇక అతడిని క్రీడల్లోకి పంపే ఆలోచనను మానుకున్నట్లు సురేష్ బాబు చెప్పారు. ఆ తరువాత రానా సినిమాలపై ఆసక్తి పెంచుకుని ఈ రంగం వైపు వచ్చాడన్నారు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న క్రికెట్ పిచ్చి ఇంకా ఇప్పటికీ కొనసాగుతోందని సురేశ్ బాబు చెప్పారు. అయితే రానాకు ఒక కన్ను సరిగా కనిపించదన్న విషయాన్ని ఆయన కూడా స్వయంగా ఓ కార్యక్రమంలో వెల్లడించారు. మంచు లక్ష్మీ ప్రసన్న నిర్వహించే ఒక టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా తనకు ఒక కన్ను కనిపించదన్న విషయాన్ని రానా చెప్పారు. ఇప్పుడు సురేశ్ బాబు కూడా అదే విషయం చెప్పు కొచ్చారు. దృష్టి లోపాన్ని దాటుకుని భారత దేశం గర్వించేలా ఎదగడం నిజంగా గ్రేట్ అంటున్నారు.