తెలంగాణలో అతి ముఖ్యమైన పండుగ బోనాలు

ఈ పండుగను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. బోనం అంటే గ్రామ దేవత (పెద్దమ్మ తల్లి, మహంకాళి, మారెమ్మ..)లకు సమర్పించే మొక్కుబడి. లేదా నియమ నిష్ఠలతో తయారు చేసే నైవేద్యమన్నమాట. ఆడ పడుచులంతా కలిసి ఘటాల(పాత్ర)లో ఉంచి ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు.

పూర్వ కాలంలో ప్రజలు మశూచి, ప్లేగు, కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలి, గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకొని పోయేవి. అందుకే అలాంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, సకాలంలో మంచి వర్షాలు పడి, పంటలు బాగా పండి, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని గ్రామ దేవతలకు ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పసుపు, కుంకుమ, చీర, సారెలతో, భోజన నైవేద్యాలను సమర్పించి భక్తి శ్రద్దలతో కొలుస్తారు. అందుకే ఈ సంబరాన్ని “బోనాల పండుగ” అంటారు.

ఈ పండుగలో ముఖ్యమైన వ్యక్తి “పోతురాజు”. ఈయన అమ్మవారికి సోదరుడు. ఈయన కోరడాతో కొడితే పిశాచి భయం, దుష్ట శక్తులు దూరమవుతాయని, కీడు తొలగిపోతుందని నమ్మకం. బోనాల పండుగలో అతి ముఖ్యమైనది రంగం చెప్పడం. ఇది పండుగ మరుసటి రోజు జరుగుతుంది. రంగం చెప్పడం అంటే భవిష్యవాణి చెప్పడం. వర్షాలు ఎలా కురుస్తాయి, పంటలు ఎలా పండుతాయో… ఒక కుటుంబానికి చెందిన అవివాహిత మహిళ మాత్రమే తరతరాలుగా చెప్పే ఆచారం ఉంది.ఈ రంగం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో జరుగుతుంది.ఆధ్యాత్మికంగా,విజ్ఞాన శాస్త్ర పరంగా పట్టణవాసులకు ఇప్పటికాలంలో ఈ పండుగ జరుపుకోవడం చాలా అవసరం.అమ్మవారు అందరిని చల్లగా చూడాలని కోరుకుందాం.