ఇప్పటి హీరోలకి ఇటువంటి సాహసాలు చేసే దమ్ము ఉందా?
నటనలో పరిణతి చెందాలంటే ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించే సత్తా తెచ్చుకోవాలి. ఇందుకోసం చాలానే కష్టపడాలి. అయితే, టాలీవుడ్ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న మన హిరోలని మనం ఎప్పుడూ హీరోయిజం వున్న క్యారెక్టర్స్ నుంచి పంధా మార్చి ప్రయోగాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సక్సెస్ కూడా సాధించారు. ముఖ్యంగా స్టార్ యాక్టర్స్ ఒక్కసారిగా లేడీ గెటప్ లో కనిపించి అచ్చం అమ్మాయిల హావభావాలు చూపించి మనల్ని అలరిస్తే, అంతకన్నా వినోదం ఏముంటుంది. అలా లేడీ గెటప్ లో వచ్చి సినీ ప్రేక్షకులను అలరించిన వారిలో ఒకప్పటి సినీ నటులు ఉన్నా,ఈ జనరేషన్ లో లేరు. అప్పటి స్టార్ హీరోలు సైతం లేడీ గెటప్స్ వేయడానికి వెనకాడేవారు కాదు. సాహసం చేసి ప్రయోగాలకు పూనుకునే వారు. కానీ ఇప్పటి హీరోలు ఇమేజ్.. ఫ్యాన్స్ అంటూ ఎక్కడలేని అడ్డుగోడలను కంఫర్ట్ జోన్ క్రియేట్ చేసుకొని కూర్చున్నారు. గతంలో ఎన్టీఆర్ , ఏఎన్నార్ లాంటి హీరోలు లేడీ గెటప్స్ వేసి మెప్పించారు.
ఆ తర్వాత జనరేషన్ లో మెగాస్టార్ చిరంజీవి సైతం జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ‘చంటబ్బాయ్’ సినిమా కోసం లేడీ గెటప్ వేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ అయితే ‘భామనే సత్యభామనే’ చిత్రంలో భామగా అలరించి ఫుల్ మర్క్స్ కొట్టేసాడు. అలాగే ‘దశావతారం’ సినిమాలో కూడా భామ పాత్రను పోషించి ప్రేక్షకు లను మంత్రముగ్దులను చేశాడు. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ కావడానికి లేడీ గెటప్స్ కూడా ఒక కారణమయ్యాయి. ఇక నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ‘మేడమ్’ ‘వివాహ బోజనంబు’ ‘ఆల్ రౌండర్’ చిత్రాలలో లేడీ గెటప్స్ లో కనిపించి మంచి నటన కనబరిచాడు. ‘అత్తర సాయిబో రారా’ అంటూ తెలుగు ప్రేక్షకులు నిజంగా లేడీ లా ఉన్నాడే అనుకునేలా చేసాడు. ఇక సీనియర్ హీరో నరేష్ కూడా ‘చిత్రమ్ భలారే విచిత్రామ్’ సినిమాలో లేడీగా కనిపించి అలరించాడు. నందమూరి బాలకృష్ణ సైతం ‘పాండురంగడు’ చిత్రంలో సత్యభామగా లేడీ గెటప్ లో కనిపించి.. ఆడపిల్లగా హావభావాలు ప్రదర్శిస్తూ అలరించాడు.
ప్రస్తుత జనరేషన్ లో చూస్తే, మంచు మనోజ్ ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమా కోసం మోహిని గా మారాడు. ఇక అల్లు అర్జున్ డెబ్యూ మూవీ ‘గంగోత్రి’లో మావయ్యది మొగల్తూరు అంటూ లేడీ గెటప్ లో స్టెప్పులేశాడు. సుమంత్ కూడా ‘ఏమో గుర్రం ఎగురవచ్చు’ మూవీలో చీరకట్టులో వయ్యారాలు పోతూ డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు. కానీ అప్పటి హీరోలు చేసిన విధంగా ఇప్పటి హీరోలు ఇలాంటి డేర్ చేయడానికి వెనుకాడుతున్నారు. వారు స్టోరీని నమ్మి పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేసే వారు. కానీ ఇప్పుడు కుదిరితే స్టోరీ చేంజ్ కొంచెం మార్చేసి, లేడీ గెటప్ లేకుండా చేయండి అంటూ చేతులెత్తేసే బాపతుగా మారిపోయారు. కానీ అన్ని రకాల పాత్రలు పోషిస్తేనే కదా నటనలో మెళుకువలు తెలిసేదన్న విషయం మర్చిపోతున్నారు.

