టాలీవుడ్ కి OTT వరమా….శాపమా…?
కరోనా మహమ్మారీ క్రైసిస్ ప్రపంచాన్ని ఒణికించడంతో పాటు అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. ఇక సినీ పరిశ్రమ ఘోరంగా దెబ్బతింది.సంక్రాంతికి వచ్చిన సినిమాలు తప్ప మరో జాడలేదు. ఆతరవాత వచ్చినా కరోనా దెబ్బకు విలవిలలాడాయి. ఎందుకంటే థియేటర్లు మూతపడిపోవడంతో టాలీవుడ్ మరణశయ్య పైకి వెళ్లినట్టు అయింది. గత నాలుగు నెలలుగా షూటింగులు, చిత్రాల విడుదల ఆగిపోయాయి. భవిష్యత్ లో ఎప్పటికి తిరిగి యథాస్థితి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి వచ్చేసింది. ఇది చాలదన్నట్లు థియేటర్ వ్యవస్థకు ధీటుగా ఓటీటీ వ్యవస్థ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బలంగా మారిపోయి, టాలీవుడ్ కి ప్రమాదకర సంకేతాల్ని ఇస్తోంది.
ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లు.. స్మార్ట్ టీవీల్లో ఓటీటీ- డిజిటల్ కు అడిక్ట్ అయిన ఆడియన్స్ ని మళ్ళీ థియేటర్లు తెరిచాక రప్పించడమెలా? అన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. ఇటు ఏపీ – నైజాం మార్కెట్లు సహా అటు అమెరికా లాంటి కీలక మార్కెట్ పై ఓటీటీ ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంటున్నారు. ఒకవేళ ఓటీటీ వ్యవస్థకు జనం పూర్తిగా అడిక్ట్ అయ్యి థియేటర్లను మర్చిపోతే కనుక అది నిజంగా చిన్న- మధ్యస్థ బడ్జెట్ చిత్రాలకు మరణశాసనం కాక తప్పదు. భారీ బడ్జెట్లతో తెరకెక్కే స్టార్ హీరోల సినిమాల వరకూ బతకగలిగినా.. చిన్న రేంజ్ సినిమాల పరిస్థితి దయనీయమే.
ముఖ్యంగా కరోనా వైరస్ లాక్ డౌన్ అయిపోయాక థియేటర్లు తెరిచినా 70 శాతం మేర జనం థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తిగా లేరని ఓ సర్వే నివేదిక ఆశ్చర్యపరుస్తోంది. రెండు మూడేళ్ల పాటు వైరస్ భయాలు అలానే ఉంటే అది మరింత కష్టకాలానికి దారి తీస్తుంది. నిజానికి ఇప్పటికే చిన్న- మధ్యతరగతి బడ్జెట్లతో తెరకెక్కిన దాదాపు 20 సినిమాలు రిలీజ్ కోసం వెయిటింగులో ఉన్నాయి.
ఇవన్నీ థియేటర్లలో కంటే ఓటీటీల్లోకి వచ్చాకే చూడాలనుకుంటే పరిస్థితి రివర్స్ కాక తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో థియేటర్లలోకి వచ్చే సినిమాలకు ఓటీటీ సినిమాలు సరితూగలే వని నిరూపించాల్సిన అవసరం ఇండస్ట్రీ మీద ఉందని అంటున్నారు. ఒక రకంగా ఈ సవాల్ ని అధిగమించాలంటే కంటెంట్ తో కొట్టక తప్పదు. ఇది నిజంగా క్రియేటర్స్ కి ఇది అతి పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఎలా అధిగమిస్తారో మరి.

