Movies

మెగాస్టార్ సినిమాల్లోకి రావటానికి ఒక వ్యక్తి కారణం…ఎవరో తెలుసా ?

ఫిలిం ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొంది, చిన్న చిన్న పాత్రలతో టాలీవుడ్ లో రాణిస్తూ, ఆతర్వాత విలన్ పాత్రలతో సైతం ఆకట్టుకుని , హీరోగా ఎదిగి,సుప్రీం హీరోగా, మెగాస్టార్ గా టాలీవుడ్ ని ఏలిన మగమహారాజు చిరంజీవి. సినిమాల్లోకి రీ ఎంట్రీ తర్వాత కూడా సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కులా ఉంటూ తన చాటుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు చిత్రీకరణ చేసిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ నిల్చింది.

వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆచార్య సినిమా మోషన్ పోస్టర్ను చిరంజీవి బర్త్ డే సందర్బంగా శనివారం సాయంత్రం విడుదల అయింది. చిరు తనయుడు, ఈ మూవీ నిర్మాత రామ్చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పోస్టర్ ని పంచుకున్నారు. ఎంత ఎత్తు ఎదిగినా ఇంకా ఒదిగి ఉంటూ … పాత రోజులను మరిచిపోకుండా ఎన్నో సార్లు ఇంటర్యుల్లో చిరు నెమరువేసుకుంటున్నారు. అయితే చిరులోని మెగాస్టార్ను‌ తొలుత గుర్తించి, వెండితెరపైకి నడిపించిన విషయాన్ని ఆయనే ఒక సందర్భంలో గుర్తుచేసుకున్నారు. “నా తండ్రి ఎస్సైగా చీరాలలో పనిచేస్తున్న రోజుల్లో అదే స్టేషన్‌లోని ఓ కానిస్టేబుల్‌ పనిచేస్తుండేవారు. నేను చెప్పే సినిమా డైలాగ్స్‌, చేసే యాక్షన్‌ మూమెంట్స్‌ చాలా ఇష్టపడుతూ నా అభినయంపై ప్రశంసలు కురిపించేవారు. కానీ, ఆయన మాటల్నెప్పుడూ అంత సీరియస్‌గా తీసుకునేవాడిని కాదని మెగాస్టార్ గుర్తుచేసుకున్నారు.

“ఆయన చీరాల పక్కనే ఉన్న పేరాలకు చెందిన కానిస్టేబుల్‌ వీరయ్య. అయితే ఓరోజు ఆయన నా దగ్గరకొచ్చి ‘బాబు మిమ్మల్ని చూస్తుంటే అచ్చు బాలీవుడ్‌ హీరో శత్రుఘ్నసిన్హా లాగే ఉన్నారు. ఆయనలాగే చేస్తున్నారు. మీరు అర్జెంటుగా సినిమా ఫీల్డ్‌కు వెళ్లిపోండి’ అని కానిస్టేబుల్ ఆరోజు అన్న మాటలు నాపై చాలా ప్రభావం చూపించాయి. అంతేకాదు, నన్ను అప్పటికప్పుడు స్టూడియోకు తీసుకెళ్లి ఫొటోలు తీయించి మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపించారు. అలా నేను అడయార్‌ ఫిలిమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు దక్కించుకున్నా. ఓ సామాన్య కానిస్టేబుల్‌ నాలో నింపిన స్ఫూర్తితో ఈస్థాయికి రాగలిగాను. ” అని చిరంజీవి గుర్తుచేసుకుని మురిసిపోయారు.