Movies

ఈ డైరెక్టర్లకు మళ్ళీ బిగ్ హిట్ దక్కేనా ?

కొందరు డైరెక్టర్స్ తమ సత్తా చాటినా,మళ్ళీ ఎందుకో తేడా కొడుతోంది. అయినా సరే, తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా అందాల రాక్షసి మూవీతో గుడ్ ఫీల్ కల్గించిన డైరెక్టర్ హను రాఘవపూడి మీద చాలా అంచనాలుంటాయి. కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడిపడిలేచే మనసు ఇలా అన్నీ వెరైటీగానే ఉంటాయి. కానీ ఫస్టాఫ్ బాగానే తీసినా సెకండాఫ్ సరిగ్గా అతికేలా తీయడని అందరూ అనేమాట. మహానటి తర్వాత అదే హీరోతో తెలుగులో హను ఓ మూవీ చేస్తున్నాడు. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక క్రిష్ మాదిరిగానే దేవా కట్టా కూడా అమెరికాలో ఉద్యోగం వదిలేసి సినిమా డైరెక్టర్ గా వచ్చినవాడే. వెన్నెల మూవీతో హిట్ కొట్టడమే కాదు,వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ ని పరిచయం చేసాడు. ఆ సినిమా అతడి ఇంటిపేరు అయింది. ఇక ప్రస్థానం మూవీ దేవా కట్టా సత్తా ఏమిటో చాటిచెప్పింది. చాలామందికి నచ్చిన ఈ మూవీ సంజయ్ దత్ హిందీలో రీమేక్ కూడా చేసాడు. బాహుబలిలో ఓ డైలాగ్ యితడు రాసిందే. అయితే సక్సెస్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. ఛాన్స్ కోసం చూస్తున్నాడు.

గజినీ మూవీతో తెలుగులో కూడా హిట్ కొట్టిన ఏ ఆర్ మురుగుదాస్ ఆతర్వాత మెగాస్టార్ తో స్టాలిన్ తీసి హిట్ అందుకున్నాడు. ఈమూవీలో ఇంటర్వెల్ సీన్ ఇప్పటికీ టాప్ సీన్. అలాగే తుపాకీ మూవీతో విజయ్ ని తెలుగు మార్కెట్ కి పరిచయం చేసాడు. సినిమా చేస్తే చాలని అందరూ అనుకునే సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో స్పైడర్ మూవీ భారీ అంచనాలతో రిలీజయింది. కానీ సీన్ రివర్స్ అయింది. మహేష్ ఫాన్స్ చాలా నిరాశకు గురయ్యారు. అలాగని ఆతర్వాత తమిళంలో తీసిన సినిమాలు కూడా హిట్ కొట్టలేదు. మళ్ళీ తుపాకీ,కత్తిలాంటి మూవీ తీస్తేనే తెలుగులో మార్కెట్ వస్తుందని అందరూ అనేమాట.

డైరెక్టర్ శంకర్ అనగానే గ్రాండ్ మూవీస్,భారీ బడ్జెట్ మూవీస్ గుర్తొస్తాయి. అతడి టేకింగ్ సూపర్. భారతీయుడు, అపరిచితుడు, రోబో ఇలా ఎన్నో సినిమాలున్నాయి. అన్ని సినిమాలు థియేటర్ కి వెళ్లి ఎంజాయ్ చేసేలా ఉంటాయి. తమిళ రైటర్ సుజాతరావు మరణంతోనే శంకర్ కి తేడాకొట్టిందన్న మాట వినిపిస్తోంది. అయితే భారతీయుడు సీక్వెల్ తో వస్తున్న శంకర్ ఈమేరకు సక్సెస్ అవుతాడో చూడాలి.

గీతాంజలి,ముంబై, సఖి ,రోజా లాంటి లెజెండరీ సినిమాలు తీసిన స్టార్ డైరెక్టర్ మణిరత్నం గురించి ఎంతచెప్పినా తక్కువే. కానీ ఈనాటి తరానికి తగ్గట్టు ఇటీవల వచ్చే సినిమాలను చూడలేక పోతున్నారు. హిట్ పడితేనే కెరీర్ అనే ఈ రోజుల్లో మణిరత్నం మళ్ళీ పూర్వంలా హిట్ కొట్టాలని ఆశించడం కన్నా తీసిన పాత సినిమాలను ఎంజాయ్ చేస్తే చాలేమో.