కంటి కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

Eye Care Tips :నిద్ర‌పోయి లేచిన త‌రువాత‌, లేదంటే జ‌లుబు, పడిశం వంటివి వ‌చ్చిన‌ప్పుడు కళ్ల కొన‌ల ద‌గ్గ‌ర పుసి క‌డుతుందని తెలుసు క‌దా. అది ఒక్కొక్క‌రిలో ఒక్కోలా ఉంటుంది. కొంద‌రిలో పుసి గ‌ట్టిగా ఏర్ప‌డితే మ‌రికొంద‌రిలో ద్ర‌వంలా ఉంటుంది. ఇంకా కొంద‌రిలో జిగ‌రు జిగురుగా మారుతుంది. అయితే ఎలా ఉన్నా పుసి ఏవిధంగా త‌యార‌వుతుందో, అస‌లు ఎందుకు వ‌స్తుందో మీకు తెలుసా? తెలీదు కదా! అయితే కింద ఇచ్చిన క‌థ‌నం చ‌ద‌వండి, మీకే తెలుస్తుంది!

క‌ళ్ల మ‌ధ్య‌లో ఉండే న‌ల్ల‌ని భాగం మ్యూక‌స్, ఆయిల్ వంటి ప‌దార్థాల‌తో త‌యారైన ఓ పొర‌ను క‌లిగి ఉంటుంది. దీన్నే ‘టియ‌ర్ ఫిలిం’ అంటారు. ఇది ఎల్ల‌ప్పుడూ క‌ళ్ల‌లోకి ఆయిల్ వంటి ద్ర‌వాల‌ను విస‌ర్జిస్తుంటుంది. దీని వ‌ల్ల మ‌నం కంటి రెప్ప‌లు ఆర్పిన‌పుడ‌ల్లా ఆ ఆయిల్ వంటి ద్ర‌వాలు కంటి అంత‌టికీ విస్త‌రించి కంటికి ర‌క్ష‌ణ క‌వ‌చంలా నిలుస్తాయి. దీంతో క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి.

అయితే ఆ ద్ర‌వాలు కళ్ల‌లో విస్త‌రించిన‌పుడ‌ల్లా క‌ళ్ల‌లో ఉండే దుమ్ము, ధూళి వంటివ‌న్నీ దూరంగా నెట్టివేయ‌బ‌డ‌తాయి. ఈ క్ర‌మంలో అలా పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మ్యూక‌స్‌, డెడ్ స్కిన్ సెల్స్‌, ఆయిల్‌, బాక్టీరియా అంతా క‌లిసి పుసిగా ఏర్ప‌డి క‌ళ్ల కొన‌ల వ‌ద్ద‌కు చేరుతాయి. అయితే ఈ పుసి ప‌గ‌టి పూట కూడా ఏర్ప‌డుతుంది.

కానీ అది అంత‌గా మ‌న‌కు క‌నిపించ‌దు. రాత్రి పూట పుసిని ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. మ‌రీ ఇక ఉద‌య‌మైతే ఆ పుసి కంటి కొన‌ల వ‌ద్ద ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. రాత్రి పూట ఎక్కువ సేపు క‌ళ్లు మూసే ఉంటాం కాబ‌ట్టి పుసి అంతా క‌ళ్ల కొన‌ల వ‌ద్ద‌కు చేరి ఎక్కువ‌గా పేరుకుపోతుంది. దీంతో ఉద‌యాన్నే క‌ళ్ల వ‌ద్ద మ‌న‌కు పుసి ఎక్కువ‌గా కనిపిస్తుంది.

సాధార‌ణంగా నిద్ర పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే పుసితో మ‌న‌కు ఎలాంటి అనారోగ్యం క‌ల‌గ‌దు. కానీ అలా కాకుండా ఇత‌ర ఏ సంద‌ర్భంలోనైనా పుసి ఎక్కువ‌గా వ‌స్తుందంటే దానికి కార‌ణం ఏదో ఉంటుంది. అంటే మనం ఏదో ఒక అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ట్టు లెక్క‌. పైన చెప్పిన విధంగా టియ‌ర్ ఫిలిం ఎక్కువ‌గా ద్ర‌వాల‌ను స్ర‌వించ‌డం, లేదా టియ‌ర్ ఫిలింకు ఏదైనా అడ్డు ప‌డ‌డం, క‌ళ్ల‌కు బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ క‌ల‌గ‌డం వంటి వాటి వ‌ల్ల పుసి ఎక్కువ‌గా వస్తుంది. బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ అయితే క‌ళ్లు ప‌చ్చ‌గా మారుతాయి.

అయితే కొన్ని సంద‌ర్భాల్లో క‌ళ్లు మ‌రీ ఎరుపుగా కూడా మారుతాయి. ఇది కూడా ఒక ర‌క‌మైన బాక్టీరియా ఇన్‌ఫెక్ష‌న్ కార‌ణంగానే సంభ‌విస్తుంది. ఇలాంటి ఇన్‌ఫెక్ష‌న్ వ‌స్తే కంటి చుట్టూ ఉండే రెప్ప‌లు ఉబ్బిపోయి కొన్ని సంద‌ర్భాల్లో క‌ళ్లు కూడా పూర్తిగా తెర‌వ‌లేని పరిస్థితి వ‌స్తుంది. కాగా పైన చెప్పిన సంద‌ర్భాల్లోనే కాకుండా క‌ళ్ల‌ను ఎక్కువ‌గా రుద్దుకున్న‌ప్పుడు కూడా పుసి ఎక్కువ‌గా వ‌స్తుంది. అయితే పుసి ఎక్కువ‌గా వ‌స్తుండ‌డాన్ని గ‌మ‌నిస్తే త‌గిన చికిత్స తీసుకుని ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌చ్చు. కాబట్టి ఈ జాగ్రత్తలు తప్పనిసరి.