MoviesTollywood news in telugu

ఈ టాలీవుడ్ హీరోలకు బ్రేక్ ఇచ్చిన సినిమాలు

అల్లు అర్జున్ – ఆర్య

అల్లు అర్జున్ ‘గంగోత్రి’ సినిమాతో సినీ అరంగేట్రం చేశాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. బన్నీ రెండో సినిమాగా తెరకెక్కిన ‘ఆర్య’ అల్లు అర్జున్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, బన్నీ నటన పరంగా పూర్తి పరిపక్వత చెందాడని చెప్పవచ్చు. డాన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, యాక్టింగ్ పరంగా కానీ ‘ఆర్య’ సినిమాతో బన్నీ ఇంకోమెట్టు ఎదిగాడు.

రామ్ చరణ్ తేజ్ – మగధీర

మెగా వారసుడిగా ‘చిరుత’ సినిమాతో తన నటప్రస్థానాన్ని మొదలుపెట్టాడు రామ్ చరణ్ తేజ్. ఈ సినిమాలో చరణ్ ప్రదర్శించిన యాక్టింగ్ స్కిల్స్ కానీ డాన్సింగ్ స్కిల్స్ కానీ చిరంజీవిని బాగానే ఫాలో అయ్యినట్లు అనిపించింది. ‘మగధీర’ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు చెర్రి. ఈ సినిమాలో తను కనబరచిన విలక్షణ నటన, ప్రేక్షకుల చేత శభాష్ అనిపించింది. ఇక ఈ సినిమాతోనే చిరు అభిమానులు.. చరణ్ కి కూడా అభిమానులుగా మారిపోయారు.

మహేష్ బాబు – ఒక్కడు

2003 లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా మహేష్ బాబు కెరీర్ ను పూర్తిగా మార్చివేసింది. అప్పటివరకు సాధారణ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబును సూపర్ స్టార్ ను చేసింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో చిత్రపరిశ్రమను ఒక ఊపు ఊపింది. సరికొత్త ఎలిమెంట్ తో రూపుదిద్దుకున్న కథ కావడంతో ప్రేక్షకులు కూడా బ్రహ్మరధం పట్టారు. మహేష్ బాబు కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ గా ‘ఒక్కడు’ సినిమా ఖచ్చితంగా మొదటి స్థానంలోనే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

పవన్ కళ్యాణ్ – తొలిప్రేమ

పవన్ కళ్యాణ్ నటించిన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’. ఈ చిత్రం ఆశించినంత స్థాయిలో ఆడలేదు. కరుణాకరన్ దర్శకత్వం వహించిన ‘తొలిప్రేమ’ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ మూవీతో పవన్ కళ్యాణ్ కు ఏర్పడిన క్రేజ్.. ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.

జూ. ఎన్టీఆర్ – ఆది

ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా మంచి పేరు సాధించిన జూ. ఎన్టీఆర్ ఆ తర్వాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ చిత్రంలో అతని నటన చూసి ఎంతో మంది అతని అభిమానులుగా మారారు. ఈ సినిమా విజయంతో అతను అగ్రనటులలో ఒకనిగా ఎదిగాడు.

రవితేజ – ఇడియట్

మొదట్లో అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసి అప్పుడప్పుడు చిన్న చిన్న పాత్రలలో మెప్పించిన రవితేజ ‘సింధూరం’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత ఎన్నో సినిమాలు హీరోగా చేసినప్పటికీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇడియట్’ సినిమా రవితేజ ను మాస్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమానే రవితేజకి యూత్ లో క్రేజ్ ను తీసుకొచ్చింది.