Healthhealth tips in telugu

Joint Pains:ముప్పైల్లోనే మోకాళ్లనొప్పులా…ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే

Joint Pains:ముప్పైల్లోనే మోకాళ్లనొప్పులా…ఈ విషయాలు తెలియకపోతే ప్రమాదమే..ఒకప్పుడు మోకాళ్ళ నొప్పులతో మన అముమ్మలు,తాతయ్యలు బాధపడటం చూసాం. కానీ ఇప్పటి రోజుల్లో 30 సంవత్సరాలు వచ్చేసరికి చాలా మందిలో మోకాళ్ళ నొప్పుల సమస్య మొదలు అవుతుంది.

దీనికి చాలా కారణాలు ఉన్నాయి. మనం తీసుకొనే ఆహారం,జీవనశైలి,తీసుకొనే ఆహారానికి తగ్గట్టుగా శారీరక వ్యాయామం లేకపోవటంతో బరువు పెరిగి ఆ భారం మోకాళ్ళ మీద పడటంతో మోకాళ్ళ నొప్పులు చాలా చిన్న వయస్సులోనే వస్తున్నాయి.

అంతేకాకుండా మోకాళ్ళ నొప్పులకు మధుమేహం,థైరాయిడ్ వంటి సమస్యలు కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. శరీరంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు గుర్తించి పరీక్షలు చేయించుకోవాలి.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు కనపడతాయి. ఆ లక్షణాలు కనపడగానే పరీక్షా చేయించుకోవాలి. ఆ లక్షణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. అతిగా ఆకలి వేయటం,నిద్రమత్తుగా ఉండటం,నిస్సత్తువుగా ఉండటం,గొంతులో తేడా వంటి లక్షణాలు కనపడగానే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.

మంచి నీళ్లు ఎక్కువగా త్రాగాలని అనిపించటం,తరచుగా మూత్రానికి వెళ్ళటం,అరికాళ్లలో మంటలుగా ఉండటం వంటివి మధుమేహ లక్షణాలుగా గుర్తించాలి.

ఒకవేళ థైరాయిడ్ సమస్య,మధుమేహ సమస్యలను నిర్లక్ష్యం చేస్తే మోకాళ్లలోని మృదులాస్థి అనే పొర అరిగిపోయి మోకాళ్లనొప్పులు వస్తాయి. సాధారణంగా మోకాళ్ళ నొప్పులు రాగానే ఎదో ఒక నొప్పుల టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఆలా కాకుండా వైద్యున్ని సంప్రదించి మందులను వాడితే మంచిది.

మోకాళ్ళ నొప్పులలో నాలుగు దశలు ఉంటాయి. ఆ దశలను బట్టి డాక్టర్స్ మందులు ఇస్తూ ఉంటారు. ఆ నాలుగు దశలు ఎలా ఉంటాయో వివరంగా తెలుసుకుందాం.

మొదటి దశ
ఈ దశలో ఎక్కువగా నడవలేకపోవటం అంటే రెండు కిలో మీటర్లు నడిచిన, రెండు అంతస్తులు ఎక్కటానికి కష్టపడటం, గంట సేపు నిల్చుని ఉంటే నీరసం రావటం వంటివి ఉంటాయి.

రెండో దశ
ఈ దశలో ఎక్కువగా నడవలేకపోవటం అంటే ఒక కిలో మీటర్లు నడిచిన, ఒక అంతస్తు ఎక్కటానికి కష్టపడటం, అర గంట సేపు నిల్చుని ఉంటే నీరసం రావటం వంటివి ఉంటాయి.

మూడో దశ
ఈ దశలో విపరీతమైన నొప్పులు ఉంటాయి. ఈ దశలో మందులు వేసుకొంటేనే ఉపశమనం కలుగుతుంది.

నాల్గో దశ
ఈ దశలో మందులు కూడా పనిచేయవు.

మొదటి మూడు దశల్లో మందులు,వ్యాయామాల ద్వారా నయం అవుతాయి. ఇక నాల్గో దశలో మాత్రం శస్త్రచికిత్స అవసరం అవుతుంది. శస్త్రచికిత్స చేయించుకున్నాక కూడా వ్యాయామాలు తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది.

తీసుకోవలసిన జాగ్రత్తలు
ఎక్కువసేపు నిలబడకూడదు. అలాగే గంటల తరబడి కింద కూర్చోకూడదు.

వాకింగ్ చేసేటప్పుడు నడిచే నేల ఎగుడు దిగుడు లేకుండా సమతలంగా ఉండేలా చూసుకోవాలి.

మెట్లు ఎక్కి దిగితే మంచి వ్యాయామం అవుతుందని చాలా మంది భావిస్తారు. అయితే ఆలా చేయటం అంత మంచిది కాదు.

బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి రోజు తప్పనిసరిగా గంట సేపు వ్యాయామం చేయాలి. కీళ్లనొప్పులు ఉన్నవారు ఏరోబిక్ వ్యాయామాలు చేయటం మంచిది.

పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో ఆకుకూరలు,పండ్లు,గుడ్డు తెల్లసొన వంటివి తీసుకోవాలి. పిండిపదార్ధాలు ఎక్కువగా తీసుకోకుండా జాగ్రత్తపడాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.