Kitchenvantalu

Masala Atukulu:కారం కారంగా 10 నిమిషాల్లో మసాలా అటుకులు

Masala Atukulu:కారం కారంగా 10 నిమిషాల్లో మసాలా అటుకులు..అటుకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అటుకులను మాములుగా తినటానికి చాలా మంది ఇష్టపడరు. అలాంటి వారు ఇలా చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.

కావలసిన పదార్దాలు
అటుకులు – రెండు కప్పులు
ఉల్లిపాయ పెద్దది – 1(ముక్కలుగా కోయాలి)
బంగాళాదుంప పెద్దది – 1(కావలసిన సైజ్ లో ముక్కలుగా కోసుకోవాలి)
కొత్తిమీర ఆకులు – కొన్ని
చింతపండు గుజ్జు – 2 స్పూన్స్
ఉప్పు – తగినంత
కరివేపాకు – కొద్దిగా

మసాలా పొడికి కావలసిన పదార్దాలు
ఎండు మిరపకాయలు – ఒకటి లేదా రెండు
మినపప్పు – అరస్పూన్
జీలకర్ర – అరస్పూన్
నెయ్యి లేదా నూనె – 2 స్పూన్స్
కొబ్బరిపొడి – ఒక స్పూన్

తయారీవిధానం
మందపాటి గిన్నె లేదా బాండిలో కొద్దిగా నెయ్యి వేసి ఎండు మిరపకాయలు, మినపప్పు,జీలకర్ర వేసి దోరగా వేగించి చల్లారిన తర్వాత కొబ్బరిపొడి వేసి మెత్తగా మిక్సీ చేయాలి. ఇప్పుడు అటుకులను శుభ్రం చేసుకొని వాటిని నీటిలో వేసి ఒకటి,రెండు నిముషాలు ఉంచి నీరంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బాండిలో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు ,కరివేపాకు వేసి దోరగా వేగించుకోవాలి. ఇప్పుడు బంగాళా దుంప ముక్కలను వేసి కొంచెం నీరు పోసి ఉడికించాలి.

ముక్కలు ఉడికిన తర్వాత చింతపండు గుజ్జు,నానబెట్టి ఉంచుకున్న అటుకులు,ఉప్పు,మసాలా పొడి వేసి దోరగా వేగించాలి. దింపేముందు కొత్తిమీర చల్లి దింపేయాలి. దీన్ని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.