Devotional

Akshaya Tritiya 2024:అక్షయ తృతీయ రోజు బంగారం ఖచ్చితంగా కొనాలా….కొనకపోతే…???

Akshaya Tritiya 2024:అక్షయ తృతీయ అనబడే వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజున శ్రీ మహా విష్ణువు పరశురామావతారాన్ని ధరించాడని పురాణాలు చెపుతున్నాయి. అక్షయ తృతీయ రోజు రాహుకాలం, వర్జ్యంతో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఎటువంటి శుభ కార్యం అయినా జరుపుకోవచ్చని పురాణాలు చెపుతున్నాయి.

నరసింహ స్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించింది కూడా ఆ రోజే. ఇలా అన్నివిధాలుగా ప్రాశస్త్యం ఉన్న రోజు అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ప్రతిదీ అయన ఇల్లాలు అయినా లక్ష్మీదేవికి కూడా ప్రీతికరమే. శ్రీ మహావిష్ణువు పరశురాముని అవతారం దాల్చిన రోజు కాబట్టి ఈ రోజున ఏమి చేసినా అది అక్షయంగా మారుతుందని పురాణాలు చెపుతున్నాయి.

ఈ రోజు చేసే పూజలు,పుణ్య కార్యాలకు సంబంధించిన ఫలితం ఎన్ని జన్మలు అయినా అలాగే ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ రోజు శక్తి మేరకు జప దానాలు చేయాలి. క్షయం కాని ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి ఈ రోజుకు అక్షయ తృతీయ అని పేరు వచ్చింది. సాధారణంగా అక్షయ తృతీయ అంటే అందరికి బంగారమే గుర్తుకు వస్తుంది. అక్షయ తృతీయ  రోజు ఏమి చేసిన శాశ్వతంగా ఉండిపోతుంది.

దాంతో బంగారం,ఆస్తులు వంటివి కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే అసలైన అర్థం అక్షయ తృతీయ రోజున ఎటువంటి పుణ్య కార్యం చేసినా ఆ ఫలితం శాశ్వతంగా ఉండిపోతుంది. అక్షయ తృతీయనాడు ఉదయాన్నే  లేచి, తలస్నానము చేసి అక్షింతలను  శ్రీ మహా విష్ణువు పాదాలపై ఉంచి పూజ చేయాలి. తరువాత ఆ బియ్యాన్ని జాగ్రత్తగా ఏరి కొంత  బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి, మిగిలిన బియ్యాన్ని దైవ ప్రసాదంగా స్వీకరించాలి.

అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారు అనే విషయానికి వస్తే….  అక్షయ తృతీయ నాడు ఏం కొంటే అది రెట్టింపు అవుతుందని నమ్మిక. అక్షయ తృతీయ శ్రీ మహా విష్ణువుకు మరియు మహా లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన పర్వదినం. అందుకే లక్ష్మీ స్వరూపమైన స్వర్ణాన్ని, అంటే బంగారాన్ని కొంటారు. అక్షయ తృతీయరోజు బంగారం కొంటే అక్షయంగా అంటే క్షీణించి పోకుండా ఐశ్వర్యం ఉంటుంది కాబట్టే అందరూ ఈ బంగారాన్ని కొంటారు.

అంతేకాదు లౌకికంగా ఆలోచించినా బంగారం విలువైన లోహం. అవసరాలకు ఉపయోగపడే వస్తువు, అత్యవసరంగా ధనం కావాలంటే బంగారాన్ని అమ్ముకోవచ్చు లేదా తాకట్టు పెట్టుకుని ఆ పనిని పూర్తి చేసుకోవచ్చు. దైవికంగా, లౌకికంగా ముఖ్యమైనది బంగారం కాబట్టే సంవత్సరంలో ఏదో ఒకరోజు కొనే సంప్రదాయాన్ని పెద్దలు ఏర్పర్చారు. దీన్నివల్ల అందరూ ఈరోజుకోసం ఎంతోకొంత ధనాన్ని దాచి బంగారం కొనుకుంటారు.

దీనివల్ల పొదుపు చేయడం అలవడుతుంది. పెద్దలు పెట్టిన ప్రతీ సంప్రదాయంలో ఏదో ఒక రహస్యం దాగి ఉందనడానికి అక్షయ తృతీయ ఒక నిదర్శనం.ఈ రోజున కేవలం బంగారం మాత్రమే కాదు ఏదైనా కొనవచ్చు.

శ్రీ మహా విష్ణువుకు, శ్రీ మహా లక్ష్మికి ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి ఈ రోజున ఎటువంటి పాప కార్యములు గాని, చెడు ఆలోచనలు కానీ చేయకుండా మంచి పనులను చేయాలి. ఎందుకంటే ఆ రోజు ఏ పని చేసిన దాని ఫలితం అక్షయం అవుతుంది. కాబట్టి పాపకార్యాలు చేస్తే ఆ ఫలితం కూడా జన్మజన్మలకూ వెంటాడుతుంది.

కాబట్టి అక్షయ తృతీయ రోజు శక్తి కొలదీ మాత్రమె దానము చెయ్యాలి, ఇబ్బంది పడుతూ శక్తికి మించిన దానమును చేయరాదు.అక్షయ తృతీయ నాడు ఏవైనా జీవితానికి పనికివచ్చే కొత్త విషయాలు నేర్చుకోవడం మానరాదు.ఎవరిమీదకూడా కోపం మరియు ద్వేషం చూపించరాదు. 

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.