Devotional

Tirumala:ప్రతి రోజు శ్రీవారికి ఎన్ని పూలదండలు వేస్తారో తెలుసా?

Tirumala tirupati:ఏడుకొండలవాడా ఆపదలమొక్కులవాడా అంటూ ఎంతో ఆర్తిగా వెళ్లే మనకు ఆ స్వామిని చూసే భాగ్యం కొన్ని నిమిషాలే. ఆ సమయంలో స్వామి వారి మెడలో ఎన్ని పూదండలు ఉన్నాయో కూడా చూడలేము. అసలు శ్రీవారికి ప్రతి రోజు ఎన్ని పూల దండలు వేస్తారో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఇప్పుడు ఆ ఏడుకొండలవాడికి ప్రతి రోజు వేసే దండల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. శిఖామణి
ఈ దండ 8 మూరలు ఉంటుంది. శ్రీవారి కిరీటం మీద నుండి రెండు భుజాల మీద వరకు అలంకరించి ఉంటుంది. ఈ దండను శిఖామణి అని అంటారు.

2. సాలిగ్రామాలుఇవి రెండు దండలు. ఒక్కో దండ దాదాపుగా నాలుగు మూరలు ఉంటాయి. ఈ దండలు శ్రీవారి భుజాల నుంచి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలిగ్రామాల మాలలకు అనుకోని వ్రేలాడతాయి. 

3. కంఠసరి
మూడు మూరలు ఉండే ఈ దండ మెడలో రెండు పోర్వలుగా రెండు భుజాల మీదికి అలంకరింపబడి ఉంటుంది. 

4. వక్ష స్థల లక్ష్మి
స్వామి వారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి, భూదేవులకు వేసే రెండు దండలు. ఇవి ఒక్కొక్కటి ఒకటిన్నర మూరలు ఉంటాయి.5. శంఖుచక్రం

శంఖుచక్రాలకు రెండు దండలు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటాయి. 

6. కఠారి సరం

శ్రీ స్వామివారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండను కఠారి సరం అని అంటారు. ఈ దండ రెండు మూరలు ఉంటుంది. 

7. తావళములు
రెండు మోచేతుల కింద, నడుము నుండి మోకాళ్ళపై హారాలుగా, మోకాళ్ళ నుండి పాదాల వరకు జీరాడుతూ వేలాడ దీసే మూడు దండలు. వీటిలో ఒకటి మూడు మూరలు ఉంటుంది. రెండవది మూడున్నర మూరలు ఉంటుంది. మూడవది నాలుగు మూరలు ఉంటుంది.
8. తిరువడి దండలు
శ్రీ స్వామివారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలను తిరువడి దండలు అని అంటారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.