Shravana Masam 2024:శ్రావణ శుక్రవారం పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి?
Shravana Masam 2024:శ్రావణ శుక్రవారం పూజ చేయటం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి.. మన పెద్దలు సంసారం సాగరం అని అన్నారు. అంతేకాక జీవితంలో కష్టాలు లేని మనుషులు ఉండరు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎదో సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. అవి సహజం కూడా.
చాలా మంది ఆర్థిక, కుటుంబ, ఉద్యోగ సమస్యలతో మనశ్శాంతిని కోల్పోయి చాలా ఆందోళన పడుతూ ఉంటారు. ఇటువంటి సమస్యల నుండి బయట పడాలంటే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంధాలలో చెప్పబడింది. సకల సౌభాగ్యాలు కూడిన ఈ వరలక్ష్మీ అమ్మవారిని పూజించడం వలన జీవితంలో ఏర్పడే ఎన్నో సమస్యల నుండి బయట పడవచ్చు.
శ్రావణ మాసం లో పౌర్ణమికి ముందు రోజున వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని చెబుతారు. ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లోని తూర్పు దిశలో వరలక్ష్మీ అమ్మవారిని పీఠంపై ఉంచి తొమ్మిది పోగుల తోరమును ధరించి నియమనిష్టలతో వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది.
అదే రోజున పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన పువ్వులను, ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలాలు లభిస్తాయని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పారట. అందువలన ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ అమ్మవారిని ఆరాధిస్తే ఆమే అనుగ్రహం తప్పకుండా దక్కుతుంది. భక్తుల మనోభీష్టం నెరవేరుతుంది.