Kitchenvantalu

Paramannam:అమ్మవారికి ప్రీతికరమైన కమ్మని బెల్లం “పరమాన్నం” ప్రసాదం..

Paramannam:అమ్మవారికి ప్రీతికరమైన కమ్మని బెల్లం “పరమాన్నం” ప్రసాదం.. పరమాన్నం.. ఈ పేరు వినని వారు, దీని రుచి ఆస్వాదించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. పరమాన్నం ఎంత రుచికరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

దీనిని బెల్లంతో, చక్కెరతో లేదా రెండింటినీ కలిపి తయారు చేస్తారు. అయితే, కొందరు పరమాన్నం తయారు చేసేటప్పుడు పాలు విరిగిపోయే సమస్యను ఎదుర్కొంటారు. పాలు విరగకుండా, రుచిగా పరమాన్నం ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పరమాన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు:
బియ్యం – 1 కప్పు
పాలు – 5 కప్పులు
బెల్లం – 2 కప్పులు
జీడిపప్పు – 1 టేబుల్ స్పూన్
ఎండుద్రాక్ష – 1 టేబుల్ స్పూన్
నెయ్యి – 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి – అర టీ స్పూన్
నీరు – తగినంత

పరమాన్నం తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినంత నీటిలో 30 నిమిషాలు నానబెట్టండి.ఒక విశాలమైన పాత్రలో 5 కప్పుల పాలు, 2 కప్పుల నీరు పోసి మరిగించండి.
పాలు మరిగిన తర్వాత, నానబెట్టిన బియ్యాన్ని నీరు వంచి వేసి, మధ్యస్థ మంటపై బియ్యం మెత్తగా ఉడికే వరకు కలుపుతూ ఉడికించండి.

బియ్యం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, బెల్లం వేసి బాగా కలపండి.ఒక చిన్న పాన్‌లో నెయ్యి వేసి, జీడిపప్పు, ఎండుద్రాక్షను బంగారు రంగు వచ్చే వరకు వేయించి, ఉడికించిన బియ్యం మిశ్రమంలో వేసి కలపండి.

మళ్లీ స్టవ్ ఆన్ చేసి, మిశ్రమాన్ని పాత్రలో ఉంచి, యాలకుల పొడి వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.ఈ విధంగా చేయడం వల్ల పాలు విరగకుండా, రుచికరమైన పరమాన్నం తయారవుతుంది.

బియ్యం కొలిచిన కప్పుతోనే బెల్లం, పాలను కూడా కొలవడం మంచిది. ఇష్టానుసారం ఇతర డ్రై ఫ్రూట్స్ లేదా పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వాడవచ్చు. బెల్లం బదులు చక్కెరను కూడా ఉపయోగించవచ్చు. పరమాన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే మరింత రుచిగా ఉంటుంది.