Vankaya Fry:ఆంధ్ర స్టైల్ “వంకాయ ఫ్రై” ఇలాచేస్తే సూపర్గా రుచి అదిరిపోద్ది..
Vankaya Fry:ఆంధ్ర స్టైల్ “వంకాయ ఫ్రై” ఇలాచేస్తే సూపర్గా రుచి అదిరిపోద్ది.. వంకాయలు మన ఆహారంలో తరచూ ఉపయోగించే కూరగాయలలో ఒకటి. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయి.
వంకాయలు షుగర్ వ్యాధిని నియంత్రించడంలో సహాయపడతాయి, కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి అనువైన ఆహారం. ఇవి అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. వంకాయలలో ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఉపయోగపడే ఫోలేట్స్ సమృద్ధిగా ఉంటాయి.
వంకాయలలో సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటు ఉన్నవారు కూడా వీటిని తినవచ్చు. తరచూ వంకాయలను ఆహారంలో తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు.
వంకాయలతో రకరకాల వంటలు తయారు చేస్తాం, అందులో వంకాయ ఫ్రై ఒకటి. ఈ రుచికరమైన వంకాయ ఫ్రైని కొత్త విధానంలో ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
వంకాయ ఫ్రై తయారీకి కావలసిన పదార్థాలు:
వంకాయలు – 250 గ్రాములు
వేయించి పొట్టు తీసిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు – 7
వెల్లుల్లి రెబ్బలు – 6
నువ్వులు – 1 టేబుల్ స్పూన్
తాళింపు కోసం కావలసిన పదార్థాలు:
సన్నగా తరిగిన ఉల్లిపాయ – 1
తరిగిన పచ్చిమిర్చి – 2
జీలకర్ర – ½ టీ స్పూన్
ఆవాలు – ½ టీ స్పూన్
శనగపప్పు – 1 టీ స్పూన్
ఎండు మిర్చి – 1
పసుపు – ½ టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు – 4
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు – 1 రెబ్బ
తరిగిన కొత్తిమీర – కొద్దిగా
వంకాయ ఫ్రై తయారీ విధానం:
వంకాయలను చిన్న ముక్కలుగా తరిగి, ఉప్పు నీటిలో వేసి ఉంచాలి.ఒక జార్‌లో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు, పొట్టు తీసిన పల్లీలను వేసి బరకగా మిక్సీలో పొడి చేయాలి.కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత పసుపు, ఉప్పు, కొత్తిమీర తప్ప మిగిలిన తాళింపు పదార్థాలను వేసి వేయించాలి.
ఉల్లిపాయ ముక్కలు సగం వేగిన తర్వాత, తరిగిన వంకాయ ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.మూత పెట్టి, మధ్యస్థ మంటపై వంకాయలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి.వంకాయలు ఉడికిన తర్వాత మూత తీసి, 5 నిమిషాలు వేయించాలి.
అనంతరం ముందుగా మిక్సీలో పొడి చేసిన ఎండు మిరపకాయల మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.2 నిమిషాలు వేయించిన తర్వాత, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇలా తయారైన వంకాయ ఫ్రై రుచికరంగా ఉంటుంది. దీనిని అన్నం, పప్పు, సాంబార్‌తో కలిపి తింటే మరింత రుచిగా ఉంటుంది. వంకాయలలోని పోషకాలు శరీరానికి అంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

