Kitchenvantalu

Cashew Nuts Tomato Curry:ధాబా స్టయిల్ “జీడిపప్పు టమాటో మసాలా కర్రీ” చపాతీ రోటి పులావ్ లోకి సూపర్..

Cashew Nuts Tomato Curry:ధాబా స్టయిల్ “జీడిపప్పు టమాటో మసాలా కర్రీ” చపాతీ రోటి పులావ్ లోకి సూపర్.. జీడిపప్పు మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందించే డ్రై ఫ్రూట్‌లలో ఒకటి. ఇందులో శరీరానికి అవసరమైన దాదాపు అన్ని రకాల విటమిన్లు ఉంటాయి, ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పును రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

జీడిపప్పు జుట్టు, చర్మ సంరక్షణలోనూ, దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలోనూ ఉపయోగపడుతుంది. ఇది బరువు తగ్గడానికి, జీర్ణ శక్తిని మెరుగుపరచడానికి, షుగర్ వ్యాధిని నియంత్రించడానికి కూడా తోడ్పడుతుంది. సాధారణంగా మనం జీడిపప్పును నేరుగా లేదా నానబెట్టి తింటాం. అలాగే, జీడిపప్పును ఉపయోగించి వివిధ రకాల కూరలను కూడా తయారు చేస్తాం. అలాంటి వాటిలో ఒకటి జీడిపప్పు, టమాటాలతో తయారు చేసే మసాలా కూర. ఈ కూర తయారీకి అవసరమైన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

జీడిపప్పు టమాటా మసాలా కూర తయారీకి కావాల్సిన పదార్థాలు:
తరిగిన టమాటాలు – 3 (మధ్యస్థ పరిమాణం)
జీడిపప్పు – 1 కప్పు
చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థ పరిమాణం)
తరిగిన పచ్చిమిర్చి – 4
పుచ్చ గింజల పప్పు – 1 టేబుల్ స్పూన్
నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు
పెద్దగా తరిగిన టమాటాలు – 2 (మధ్యస్థ పరిమాణం)
నూనె – 2 టేబుల్ స్పూన్లు
పసుపు – ½ టీ స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం – తగినంత
ధనియాల పొడి – ½ టీ స్పూన్
జీలకర్ర పొడి – ½ టీ స్పూన్
నీళ్లు – ½ గ్లాసు
గరం మసాలా – ½ టీ స్పూన్
కసూరి మెంతి – 1 టీ స్పూన్
బటర్ – కొద్దిగా
ఫ్రెష్ క్రీమ్ – కొద్దిగా

జీడిపప్పు టమాటా మసాలా కూర తయారీ విధానం:
ముందుగా ఒక జార్‌లో 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు, పుచ్చ గింజల పప్పు, నువ్వులు వేసి మెత్తగా పొడిగా చేయాలి.ఆ తర్వాత పెద్దగా తరిగిన టమాటా ముక్కలను వేసి, వాటిని పేస్ట్‌లా చేయాలి.ఒక కళాయిలో నూనె వేసి కాగిన తర్వాత మిగిలిన జీడిపప్పును వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి, ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టాలి.

అదే నూనెలో తరిగిన ఉల్లిపాయలను వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.తర్వాత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి వేయించాలి.ఆ తర్వాత ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం వేసి బాగా కలపాలి.

ఇప్పుడు ముందుగా తయారు చేసిన జీడిపప్పు-టమాటా పేస్ట్‌ను వేసి, 5 నిమిషాల పాటు ఉడికించాలి.తర్వాత తరిగిన టమాటా ముక్కలను వేసి, మూత పెట్టి టమాటాలు పూర్తిగా ఉడికే వరకు ఉంచాలి.ఆ తర్వాత వేయించి పెట్టుకున్న జీడిపప్పు, తరిగిన పచ్చిమిర్చి, ఆ తర్వాత ½ గ్లాసు నీళ్లు పోసి కలిపి, మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించాలి.

చివరగా గరం మసాలా, కసూరి మెంతి వేసి కలిపి, 1 నిమిషం ఉడికించి స్టవ్ ఆపేయాలి.అంతటితో బటర్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలపాలి. ఫ్రెష్ క్రీమ్‌కు బదులుగా పాల మీగడను కూడా ఉపయోగించవచ్చు.

ఈ విధంగా తయారైన జీడిపప్పు టమాటా మసాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీన్ని పుల్కా, పూరీ, రోటీ, చపాతీలతో కలిపి తింటే రుచితో పాటు జీడిపప్పులోని పోషకాలు శరీరానికి అందుతాయి.