Credit Card:క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేశారో.. మీ జేబుకు చిల్లే! వడ్డీతోనే ఇల్లు గుల్ల!
Credit Card:క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? ఈ 5 తప్పులు చేశారో.. మీ జేబుకు చిల్లే! వడ్డీతోనే ఇల్లు గుల్ల.. ఈ రోజుల్లో జేబులో డబ్బు లేకపోయినా పర్లేదు కానీ, క్రెడిట్ కార్డ్ లేకపోతే పనులు జరగట్లేదు. షాపింగ్ నుంచి ఎమర్జెన్సీ వరకు ఇది వరమే. కానీ, వాడటం తెలియకపోతే మాత్రం మెడకు చుట్టుకున్న పాములా మారుతుంది. బ్యాంకులు కోరుకునేది కూడా అదే.. మీరు తప్పు చేయాలి, వాళ్లు పెనాల్టీలు వేయాలి అని. మీరు ఆ వలలో పడకూడదంటే ఈ 5 విషయాలు అస్సలు మర్చిపోవద్దు.
1. అతి పెద్ద ఉచ్చు.. ‘మినిమం డ్యూ’ (Minimum Due): బిల్లు మొత్తం రూ. 50,000 వచ్చింది అనుకుందాం. అందులో ‘మినిమం డ్యూ’ రూ. 2,500 కట్టమని కనిపిస్తుంది. “అమ్మయ్య.. ఇది కడితే చాలు” అనుకుంటే మీరు మునిగినట్టే.
మిగిలిన బ్యాలెన్స్ మీద బ్యాంకులు 30% నుంచి 45% వడ్డీ వేస్తాయి. ఇది మామూలు వడ్డీ కాదు.. చక్రవడ్డీ! అందుకే అప్పు తెచ్చయినా సరే ‘Total Due’ కట్టేయడమే ఉత్తమం.
2. డేట్ మర్చిపోతే.. డబుల్ ధమాకా: బిజీ లైఫ్ వల్ల చాలామంది ‘Due Date’ మర్చిపోతుంటారు.గడువు దాటితే లేట్ పేమెంట్ ఛార్జీలు (రూ. 500 – రూ. 1000) పడతాయి.
అంతకంటే ఘోరం.. మీ CIBIL Score (క్రెడిట్ స్కోర్) పడిపోతుంది. భవిష్యత్తులో మీకు ఇల్లు, కారు లోన్లు రావడం కష్టమైపోతుంది. ఫోన్లో రిమైండర్ పెట్టుకోవడం మర్చిపోవద్దు.
3. లిమిట్ దాటితే.. బాదుడే: మీ కార్డు లిమిట్ లక్ష రూపాయలు అయితే.. లక్షా పది వేలు వాడకూడదు. లిమిట్ దాటితే ‘Over Limit Charges’ వడ్డిస్తారు.
నిపుణుల సలహా: మీ లిమిట్లో ఎప్పుడూ 30% – 40% మాత్రమే వాడండి. అప్పుడే సిబిల్ స్కోర్ పెరుగుతుంది.
4. స్టేట్మెంట్ చూడకపోవడం: మెసేజ్ చూసి డబ్బులు కట్టేయడమే తప్ప.. అసలు స్టేట్మెంట్లో ఏముందో చాలామంది చూడరు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే హిడెన్ ఛార్జీలు (Hidden Charges) లేదా టెక్నికల్ లోపాల వల్ల అదనపు డబ్బు కట్ అవుతుంది. అందుకే ప్రతీ లావాదేవీని చెక్ చేసుకోవాలి.
5. కార్డు ఫ్రీ అనుకుంటున్నారా? కార్డు తీసుకునేటప్పుడు ‘Lifetime Free’ అన్నారా లేక ‘Annual Fee’ ఉందా అని చూసుకోండి. వాడని కార్డుకు కూడా వేల రూపాయలు వార్షిక రుసుము కట్టాల్సి వస్తే అది దండగ ఖర్చే!
క్రెడిట్ కార్డ్ అనేది పదునైన కత్తి లాంటిది. అవసరానికి వాడుకుంటే రక్షణ.. ఇష్టమొచ్చినట్లు వాడితే మన చేతులే తెగుతాయి. జాగ్రత్త!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://www.telugulifestyle.com/

