వేడి వేడి అన్నంలోకి టమాటా-కరివేపాకు పచ్చడి.. కాస్త నెయ్యి వేసుకుని తింటే రుచి అద్భుతమే!
రోటీ పచ్చళ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందులోనూ టమాటా పచ్చడి అంటే చాలా మందికి ఫేవరెట్. సాధారణంగా మనం టమాటా పచ్చడిలో పుదీనా లేదా కొత్తిమీర వేస్తుంటాం.
కరివేపాకును కేవలం తాలింపు కోసమే వాడి.. తినేటప్పుడు తీసి పక్కన పెట్టేస్తుంటాం. కానీ, ఎప్పుడైనా కరివేపాకును ప్రధానంగా వాడి టమాటా పచ్చడి చేశారా?

లేదంటే ఒక్కసారి ఈ ‘టమాటా-కరివేపాకు చట్నీ’ ట్రై చేయండి. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.. పైగా ఈ పచ్చడిలో వేడి వేడి అన్నం, కాస్త నెయ్యి కలుపుకుని తింటే ఆ మజాయే వేరు. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూసేయండి!
పచ్చడికి కావాల్సిన పదార్థాలు:
టమాటాలు: 300 గ్రాములు
కరివేపాకు: 1 కప్పు (నిండుగా)
కొత్తిమీర: ¼ కప్పు
పచ్చిమిర్చి: 6
పచ్చి కొబ్బరి తురుము: ½ కప్పు
నువ్వులు: 1.5 టేబుల్ స్పూన్
నూనె: 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు: రుచికి సరిపడా

తాలింపు (పోపు) కోసం:
ఆవాలు: ½ టీ స్పూన్
జీలకర్ర: ½ టీ స్పూన్
మినపప్పు: ½ టీ స్పూన్
పచ్చి శనగపప్పు: 1 టీ స్పూన్
ఎండుమిర్చి: 2

తయారీ విధానం ఇదీ..
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని కొద్దిగా నూనె వేడి చేయాలి. అందులో నువ్వులు వేసి చిటపటలాడేదాకా వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి తురుము వేసి పచ్చివాసన పోయేలా బాగా కలుపుతూ వేయించుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో కరివేపాకు వేసి పసరు వాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలి. వేగిన ఈ మిశ్రమాన్నంతటినీ (నువ్వులు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొబ్బరి) ఓ మిక్సీ జార్‌లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మళ్లీ అదే పాన్‌లో మరో స్పూన్ ఆయిల్ వేసి టమాటా ముక్కలు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గుజ్జులా అయ్యేవరకు మగ్గించాలి.

టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత.. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్‌లో ఈ టమాటా గుజ్జును కూడా వేసి, మిక్సీని ఒకటి లేదా రెండుసార్లు కచ్చాపచ్చాగా (Pulse) తిప్పుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్‌లా చేయకూడదు.
ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి వేసి దోరగా వేగనివ్వాలి. ఈ పోపును తీసుకెళ్లి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి కలుపుకోవాలి.
అంతే.. ఎంతో కమ్మగా ఉండే ‘టమాటా కరివేపాకు పచ్చడి’ రెడీ! వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే.. ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా లాగించేస్తారు. దోశ, ఇడ్లీ లాంటి టిఫిన్స్‌లోకి కూడా ఇది అదిరిపోతుంది. ట్రై చేసి చూడండి!

