ఆషాడ మాసం అంటే అశుభం అని ఎందుకంటారు? దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి?
తెలుగు క్యాలెండర్ ప్రకారం నాలుగో నెల ‘ఆషాడ మాసం’. ఈ నెల రాగానే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లాంటి శుభకార్యాలన్నీ ఆగిపోతాయి. దీనిని ‘శూన్య మాసం’ అని కూడా పిలుస్తారు.
అసలు ఆషాడ మాసంలో శుభకార్యాలు ఎందుకు చేయరు? దీని వెనుక ఉన్న అసలు కారణాలు కేవలం నమ్మకాలు మాత్రమే కావు, మన పూర్వీకులు ఆలోచించి పెట్టిన సైన్స్ కూడా ఉంది. అవేంటో ఇక్కడ చూద్దాం.
శుభకార్యాలు ఎందుకు చేయరంటే..
ఆషాడ మాసం అంటే వర్షాకాలం పీక్ స్టేజ్‌లో ఉంటుంది. పూర్వకాలంలో రవాణా సదుపాయాలు సరిగ్గా ఉండేవి కావు. భారీ వర్షాల వల్ల నదులు, వాగులు పొంగిపొర్లేవి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్లడం చాలా కష్టంగా ఉండేది.
ఇలాంటి సమయంలో పెళ్లిళ్లు లాంటి పెద్ద వేడుకలు చేస్తే, బంధువులు రావడం కష్టం, అలాగే వర్షాల వల్ల ఏర్పాట్లు చేయడం కూడా చాలా ఇబ్బందిగా మారేది. అంతేకాకుండా, నీటి కాలుష్యం వల్ల రోగాలు ప్రబలే అవకాశం ఎక్కువ. అందుకే ఈ మాసంలో శుభకార్యాలను వాయిదా వేశారు.

అత్తాకోడళ్లు ఒకే ఇంట్లో ఎందుకు ఉండకూడదు?
ఆషాడ మాసం రాగానే కొత్తగా పెళ్లైన కోడలు పుట్టింటికి వెళ్లడం మన ఆచారం. దీని వెనుక ఒక బలమైన సైంటిఫిక్ రీజన్ ఉంది. ఆషాడ మాసంలో గర్భం దాల్చితే, తొమ్మిది నెలల తర్వాత సరిగ్గా చైత్ర లేదా వైశాఖ మాసాల్లో (ఏప్రిల్ – మే) అంటే ఎండాకాలం తీవ్రంగా ఉన్నప్పుడు డెలివరీ అవుతుంది.
ఆ సమయంలో విపరీతమైన వేడికి పుట్టే బిడ్డకు, తల్లికి ఇద్దరికీ ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయని, ఆ కాలంలో ఎలక్ట్రిసిటీ, ఏసీలు లేకపోవడం వల్ల ఆ నియమాన్ని పెట్టారు.
గోరింటాకు వెనుక ఉన్న అసలు రహస్యం
ఆషాడ మాసం అనగానే మహిళలకు ముందుగా గుర్తొచ్చేది గోరింటాకు. ఇది కేవలం అందం కోసమే కాదు, ఆరోగ్యం కోసం కూడా!వర్షాకాలం కావడంతో పొలాల్లో, నీళ్లలో ఎక్కువగా పనిచేయడం వల్ల చేతులు, కాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి.గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చర్మ వ్యాధులను దరిచేరనివ్వవు.
అలాగే, ఇది శరీరంలో ఉన్న వేడిని తగ్గించి చలువ చేస్తుంది.పండుగలకు కొదవ లేదు!ఆషాడ మాసంలో శుభకార్యాలు లేకపోయినా, పండుగలకు మాత్రం కొదవ లేదు. తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బోనాల జాతర ఈ మాసంలోనే మొదలవుతుంది. అమ్మవారికి బోనాలు సమర్పించి చల్లగా చూడమని వేడుకుంటారు.
అలాగే ఒడిశాలో జరిగే ప్రసిద్ధ పూరీ జగన్నాథుని రథయాత్ర, మరియు గురువులను స్మరించుకునే గురు పూర్ణిమ కూడా ఈ ఆషాడ మాసంలోనే వస్తాయి.
కాబట్టి, ఆషాడ మాసం అంటే కేవలం అశుభం కాదు, వాతావరణ మార్పులకు అనుగుణంగా మన జీవనశైలిని మార్చుకుంటూ, ప్రకృతిని ఆరాధించే ఒక ప్రత్యేకమైన మాసం!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

