నోరూరించే పన్నీర్ బఠానీ సమోసా.. ఇలా చేస్తే రుచి అద్భుతం!
Paneer Batani Samosa:సాయంత్రం చల్లగాలి వేస్తున్నప్పుడు లేదా వేడివేడిగా టీ తాగుతున్నప్పుడు కరకరలాడే స్నాక్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదూ! ఎప్పుడూ తినే ఆలు సమోసాలే కాకుండా.. ఈసారి కాస్త కొత్తగా, రుచిగా ‘పన్నీర్ బఠానీ సమోసా’ ట్రై చేసి చూడండి.
పైన కరకరలాడే పొర.. లోపల కమ్మని పన్నీర్, పచ్చి బఠానీల మసాలాతో ఈ సమోసా రుచి అద్భుతంగా ఉంటుంది. ఇంట్లోని వారందరికీ కచ్చితంగా నచ్చే ఈ స్పెషల్ సమోసాని, బండి మీద దొరికే టేస్ట్‌తో ఇంట్లోనే ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం రండి.
సమోసా ప్రియుల కోసం అదిరిపోయే.. పన్నీర్ సమోసా రెసిపీ.. సహజంగా అందరు ఆలు, ఆనియన్ సమోసా ఎక్కువగా తింటుంటారు. ఈ సారి కొత్తగా, వైరైటీగా పన్నీర్ సమోసా ట్రై చేయండి. దీన్ని ఇంట్లోనే సింపుల్ గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం.
కావలసినవి:
మైదా – పావు కేజీ
డాల్డా లేదా నెయ్యి – 50గ్రా
ఉప్పు – చిటికెడు
పనీర్ తురుము – 200 గ్రా
పచ్చి బఠాణీలు, లేదా నానబెట్టిన బఠాణీలు – 100 గ్రా
పచ్చిమిర్చి – 6
ఆవాలు – పావు టీ స్పూను
జీలకర్ర – పావు టీ స్పూను
ఉప్పు – తగినంత
మిరియాలపొడి – పావు టీ స్పూను
నూనె – వేయించడానికి తగినంత
తయారి:
జల్లించిన మైదాలో ఉప్పు, కరిగించిన డాల్డా వేసి బాగా కలపాలి. తరవాత నీరు పోసి చపాతీపిండిలా కలిపి మూత పెట్టాలి. రెండు చెంచాల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక పచ్చిమిచ్చి తరుగు వేసి కొద్దిగా వేయించాలి.
బఠాణీలు వేసి తడిపోయేవరకు వేయించాక, పనీర్ తురుము, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలిపి మరో ఐదునిమిషాలు వేయించాలి. మెత్తబడిన పిండిని చిన్నచిన్న ఉండలుగా చేసి పూరీల్లా ఒత్తుకోవాలి.
చాకుతో రెండు భాగాలుగా కట్ చేయాలి. ఒక భాగం తీసుకుని అంచులు తడిచేసి కోన్‌లా మడిచి చెంచాడు పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు విడిపోకుండా ఒత్తి వేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

