పిండి కలిపేటప్పుడు ఈ చిన్న పని చేస్తే.. పూరీలు, గారెలు అస్సలు నూనె పీల్చవు!
Cooking Tips:పండగలు వచ్చినా, ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నా గారెలు, బూరెలు, పూరీలు వంటి పిండి వంటలు చేయడం మనకు ఆనవాయితీ. అయితే వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా మంది ఇల్లాలికి ఎదురయ్యే ప్రధాన సమస్య.. అవి విపరీతంగా నూనెను పీల్చేయడం! నూనె ఎక్కువగా పీల్చిన గారెలు లేదా పూరీలు తినడం వల్ల నోటికి ఆయిలీగా తగలడమే కాకుండా, గ్యాస్ట్రిక్ మరియు అజీర్తి సమస్యలు కూడా వస్తుంటాయి.
అలా కాకుండా మనం వేసే గారెలు, బూరెలు లేదా పూరీలు చుక్క నూనె కూడా ఎక్కువగా పీల్చుకోకుండా, క్రిస్పీగా మరియు పొంగుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడు మరియు కాగే నూనెలో వేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న వంటింటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఆ సీక్రెట్ కిచెన్ టిప్స్ ఏంటో ఈ ఆర్టికల్లో వివరంగా తెలుసుకుందాం.
గారెలు, బూరెలు,పూరిలు ఎక్కువ నూనె పీల్చుకోకుండా ఉండాలంటే… గారెలూ, బూరెల్లాంటివి నూనెలో వేయించుకోవడం తప్పనిసరే కానీ, కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఆ నూనె వినియోగాన్ని కొంతవరకూ తగ్గించవచ్చు.
గారెలను మినపప్పుతో కాకుండా సెనగపప్పుతో ప్రయత్నిస్తుంటే.. ఆ పిండిని కాస్త పల్చగా చేసుకుని పెనంమీద లేదా బాణలిలో వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకోవచ్చు. లేదూ గారెలే చేసుకోవాలని అనుకుంటే మాత్రం… నూనె ఎంపిక నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్ లో దొరికే ప్రతి నూనె వేపుళ్లకు పనికిరాదు.
రైస్ బ్రాన్, సన్ఫ్లవర్, సన్ ఫ్లవర్, వేరుశనగ నూనె వంటి వాటిని ఎంచుకోవాలి. లేదంటే నూనెలో రసాయనాలు విడుదలై.. పదార్థం కాలిన వాసన రావడమే కాకుండా ఆరోగ్యానికీ కూడా మంచిది కాదు.

బాణలిలో నూనె పోసి బాగా కాగనివ్వాలి. అప్పుడు గారె లేదా బూరె వేసినప్పుడు వెంటనే బయటి భాగం కాలి, దానిలోని నీరు బయటకు పోయి బుడగలు వస్తాయి. ఆ తరవాత అది వేగి, దాని చుట్టూ కరకరలాడే పొర ఏర్పడుతుంది. ఆ తరవాత మంట తగ్గిస్తే లోపలి భాగం కూడా పూర్తిగా వేగుతుంది. అలాగే తక్కువ నూనెను పీల్చుకుంటాయి.
అలా కాకుండా నూనె కాగకుండానే పిండిని వేస్తే.. నీరు నెమ్మదిగా బయటకు పోయి గాలి లోపలికి చేరి.. ఆ పదార్థం వేగినప్పుడు ఎక్కువ నూనె పీల్చుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల పదార్థం కూడా సాగినట్లు వస్తుంది.
ఈ రోజుల్లో మెటల్ బాస్కెట్లు దొరుకుతున్నాయి. దాని అడుగున పల్చని జాలిలా ఉంటుంది. బాణలిలో నూనె పోసాక ఈ మెటల్ బాస్కెట్ను అందులో ఉంచాలి. ఈ బాస్కెట్లో గారె లేదా బూరె వేస్తే.. ఏదయినా పదార్థం చిట్లినా కూడా ఆ బాస్కెట్లోనే ఉంటుంది. ఈ బాస్కెట్లు ఒకటి నుంచి పది గారెలు వేగించుకొనేందుకు వీలుగా ఉంటుంది.
అలాగే పకోడీలూ, బజ్జీల్లాంటివి చేసేటప్పుడు ఆ పిండిలో రెండు లేదా మూడు చెంచాల బియ్యప్పిండి కలిపితే కరకరలాడేలా రావడమే కాకుండా నూనె ను తక్కువగా పీల్చుకుంటాయి.
తోపు పిండిగా మైదాను ఎన్నిక చేసుకున్నప్పుడు కొంచెం బియ్యప్పిండి కలుపుకోవాలి. అప్పుడు చేసే పిండి వంటలు నూనెను తక్కువ పీల్చుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు.

