లంచ్ బాక్స్ కోసం టెన్షనా? కేవలం 10 నిమిషాల్లో హెల్తీ ‘పాలక్ కార్న్ క్యాప్సికం రైస్’.. టేస్ట్ అదుర్స్!
ఉదయాన్నే పిల్లలకు, ఆఫీస్‌కు వెళ్లేవారికి లంచ్ బాక్స్ ఏం చేయాలో తోచట్లేదా? రోజూ ఒకే రకమైన వంటలు తిని బోర్ కొట్టిందా? అయితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పాలకూర, స్వీట్ కార్న్, క్యాప్సికం కలిపి ఇలా సూపర్ టేస్టీగా ఫ్రైడ్ రైస్ చేసి చూడండి.

ఆకుకూరలు తినని పిల్లలు కూడా ఒక్క మెతుకు కూడా వదలకుండా లంచ్ బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు..విడివిడిగా ఎన్నో పోషకాలు ఉండే ఈ మూడింటితో స్పెషల్ రైస్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
ఉడికించిన అన్నం – 1 కప్పు (పొడిపొడిగా ఉండాలి)
పాలకూర తరుగు – 1.5 కప్పు (శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి)
స్వీట్ కార్న్ – ¼ కప్పు
క్యాప్సికం ముక్కలు – ¼ కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరగాలి)
పచ్చిమిర్చి – 2
అల్లం తురుము – 1 టేబుల్ స్పూన్

జీలకర్ర – 1 టీ స్పూన్
సాంబార్ పొడి – 1 టీ స్పూన్ (మంచి ఫ్లేవర్ కోసం)
మిరియాల పొడి – ½ టీ స్పూన్
నిమ్మరసం – 1 టీ స్పూన్
ఉప్పు, పసుపు – తగినంత
నూనె – 4 టేబుల్ స్పూన్స్
తయారీ విధానం ఇదీ.. (Simple Steps)
ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని నూనె వేడి చేయాలి. నూనె కాగాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి.
ఆ తర్వాత సన్నగా తరిగిన అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, స్వీట్ కార్న్, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కూరగాయలు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
ఉల్లిపాయలు, కార్న్ వేగిన తర్వాత సన్నగా తరిగిన పాలకూర వేసి, ఆకుకూరలోని పసరు వాసన (పచ్చివాసన) పోయే వరకు బాగా వేయించాలి.

పాలకూర చక్కగా మగ్గిన తర్వాత, అందులో సాంబార్ పొడి వేసి మరో అర నిమిషం (30 సెకన్లు) పాటు వేయించుకోవాలి.
చివరగా ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, మిరియాల పొడి వేసి మంటను హై ఫ్లేమ్‌లో (High flame) ఉంచి బాగా కలుపుకోవాలి. అన్నం వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.
ఇవి కూడా చదవండి:
చివరగా ఒక స్పూన్ నిమ్మరసం పిండుకుని కలుపుకుంటే చాలు.
ఎంతో రుచికరమైన, కమ్మటి వాసన వచ్చే వేడి వేడి ‘పాలక్ కార్న్ క్యాప్సికం రైస్’ రెడీ! దీనిని రైతా (పెరుగు పచ్చడి)తో సర్వ్ చేస్తే రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం మీరూ ట్రై చేయండి!

