Bellam Ravva Laddu: నోట్లో వేస్తే కరిగిపోయే ‘బెల్లం రవ్వ లడ్డూలు’.. ఎప్పుడైనా ట్రై చేశారా? టేస్ట్ అద్భుతం!
Bellam Ravva laddu:సాధారణంగా బొంబాయి రవ్వ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఉప్మా లేదా రవ్వ కేసరి. అలాగే స్వీట్ విషయానికొస్తే చాలా మంది పంచదార (చక్కెర) ఉపయోగించి రవ్వ లడ్డూలు చేస్తుంటారు.
కానీ, పంచదారకు బదులుగా బెల్లం కలిపి రవ్వ లడ్డూలు చేస్తే ఆ రుచే వేరు! ఇది కేవలం నోటికి రుచిని అందించడమే కాకుండా, బెల్లం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు, ఐరన్ కూడా అందుతాయి.

పండగలకైనా, స్నాక్స్ కైనా ఎంతో హెల్తీగా ఉండే ఈ బెల్లం రవ్వ లడ్డూలను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
కావలసిన పదార్థాలు:
బొంబాయి రవ్వ (సుజీ): 1 కప్పు
బెల్లం తురుము: 1 కప్పు
ఎండుకొబ్బరి తురుము: పావు కప్పు
నెయ్యి: 4 నుండి 5 స్పూన్లు
డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, కిస్‌మిస్): తగినన్ని
యాలకులు: 4 (పొడి చేసుకోవాలి)

లడ్డూల తయారీ విధానం:
మొదట స్టవ్ ఆన్ చేసి మూకుడు (బాణలి) పెట్టి, అందులో నెయ్యి వేసి వేడెక్కాక మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోండి.
అదే నెయ్యిలో బొంబాయి రవ్వ వేసి మంచి సువాసన వచ్చే వరకు లో-ఫ్లేమ్‌లో వేయించి పక్కన పెట్టండి. ఆ తర్వాత ఎండుకొబ్బరి తురుమును కూడా కాస్త వేయించి పెట్టుకోవాలి.
ఇప్పుడు మరొక గిన్నెలో కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించండి.
బెల్లం కరిగాక, ఆ నీటిని నలకలు లేకుండా మూకుట్లోకి వడకట్టుకోవాలి. ఈ బెల్లం నీటిని కాస్త జీడిపాకం (లేత పాకం) వచ్చే వరకు ఉడికించాలి.

పాకం వచ్చాక అందులో యాలకుల పొడి, ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, ఎండుకొబ్బరి, డ్రై ఫ్రూట్స్ వేసి అడుగు అంటకుండా బాగా కలపాలి. అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిశాక స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోండి.
ఈ మిశ్రమం కాస్త చల్లారి గోరువెచ్చగా ఉన్నప్పుడు, చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుంటూ మీకు నచ్చిన సైజులో లడ్డూలను చుట్టుకోవాలి.

ఆరోగ్య చిట్కా: పంచదార లేని ఈ హెల్తీ బెల్లం రవ్వ లడ్డూలను రోజుకు ఒకటి చొప్పున పిల్లలకు, పెద్దలకు ఇస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
ఇవి కూడా చదవండి:
గమనిక:ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

