Politics

జగన్ – పవన్ కలుస్తారా – కలపడానికి ట్రై చేసేదెవరో తెలుసా?

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శాశ్వత శత్రువులు ఉండరు . అలాగే శతృవుకి శతృవు మిత్రుడని కూడా అంటారు. ఇక ఎపి రాజకీయాల్లో ఇదే సూత్రం వర్తించేలా ఉంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగబోతున్న తరుణంలో వాతావరణం వేడిగా మారితే,తాజాగా టి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,వైసిపి అధినేత జగన్ ని కలవడంతో మరింత వేడెక్కింది. ఈ పరిణామం ఎటు దారితీస్తుందో చెప్పలేం. కానీ టిడిపి ఓటమి లక్ష్యంగా టీఆర్ ఎస్ పావులు కడుపుతోందన్నది వాస్తవం.

ఇటీవల జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ తో జతకట్టి ప్రజకూటమి ఏర్పరచడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించడమే కాదు,టి ఆర్ ఎస్ ని ఓడించడానికి శతవిధాలా ప్రయత్నం చేసారు. అందుకే ఎన్నికల్లో గెలిచాక టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్, ఏపీలో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని ప్రకటించేసారు. మరోపక్క దేశంలో బిజెపికి వ్యతికరేకంగా కాంగ్రెస్ సారధ్యంలో అన్ని పార్టీలను కలపడానికి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. దీంతో కాంగ్రెస్,బిజెపిలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ అంటూ కేసీఆర్ దేశంలో అన్నిపార్టీలతో మంతనాలు మొదలెట్టేసారు. అందులో భాగంగా జగన్ తో కేటీఆర్ భేటీ అయ్యారు.

అయితే వీరిద్దరి కలయికతో టిడిపి స్పందిస్తూ ఈ పార్టీలను బిజెపి వెనుకనుంచి నడిపిస్తోందని ప్రెస్ మీట్స్ తో ఊదరగొట్టేస్తున్నారు. చంద్రబాబుని ఎలాగైనా ఓడించాలని జగన్ ట్రై చేస్తుంటే, గత ఎన్నికల్లో టిడిపికి అండగా నిలిచినా పవన్ కళ్యాణ్ కూడా టిడిపి ఓటమి లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇద్దరి లక్ష్యం ఒకటే అయినపుడు పవన్ ని కలుపుకుని వెళ్లాలని టిఆర్ ఎస్ నేతలు సూచిస్తున్నారట.

జగన్ తో కేటీఆర్ భేటీ సందర్బంగా ఈ మాటలు కూడా వచ్చాయట. జగన్,పవన్ కలిస్తే చంద్రబాబును ఓడించడం పెద్ద కష్టం కాదని టీ ఆర్ ఎస్ నేతల అభిప్రాయంగా ఉంది. అందుకే పవన్ ని ఒప్పిస్తానని కేటీఆర్ చెప్పారట. మరి ఇద్దరూ కలుస్తారా, కలిసి చంద్రబాబుని గద్దె దించుతారా,లేక అందరినీ ఎదుర్కొని చంద్రబాబు మళ్ళీ అధికారం చేపడతారా అనేది వేచి చూడాలి.