Kasuri Methi : వంటల్లో వాడే ఘుమ ఘుమలాడే “కసూరీ మేథీ” ని ఇలా సులభంగా చేసేయండి..
Kasuri Methi : వంటల్లో వాడే ఘుమ ఘుమలాడే “కసూరీ మేథీ” ని ఇలా సులభంగా చేసేయండి.. ప్రస్తుతం చాలా మంది వంటల్లో కసూరీ మేథీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇది వంటలకు అద్భుతమైన రుచి, సుగంధాన్ని జోడిస్తుంది మరియు ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అందుకే దీని వాడకం బాగా పెరిగింది. ఈ కసూరీ మేథీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటగా మెంతి ఆకులను 10 నిమిషాల పాటు ఉప్పు నీటిలో నానబెట్టాలి. తరువాత వాటిని శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డ లేదా టవల్‌పై వేసి నీరు పూర్తిగా పిండి వేయాలి. తడి పూర్తిగా తొలగే వరకు ఆకులను ఆరబెట్టాలి.
ఈ ఆకులను చిన్న ముక్కలుగా కోసి, టిష్యూ పేపర్ లేదా కాగితంపై వేసి మూడు రోజుల పాటు నీడలో ఆరబెట్టాలి. ఈ సమయంలో ఎండ తగలకుండా, కేవలం గాలి మాత్రమే తగిలేలా జాగ్రత్త వహించాలి. ఆ తరువాత, ఈ ఆకులను ఒక గంట పాటు ఎండలో ఆరబెట్టాలి. ఇలా చేస్తే అవి పొడి పొడిగా తయారవుతాయి. చివరగా, వీటిని ఓవెన్‌లో ఒక నిమిషం పాటు వేడి చేసి బయటకు తీయాలి.
ఓవెన్ లేనివారు పెనంపై ప్లేట్ పెట్టి, ఆకులను ఒక నిమిషం వేడి చేయాలి. ఇలా చేస్తే కసూరీ మేథీ సిద్ధమవుతుంది. దీన్ని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన కసూరీ మేథీ 4 నుంచి 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. మెంతి ఆకుల్లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి, ఇలా తయారు చేసి వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

