Kitchenvantalu

Coriander Rice : పది నిమిషాల్లో రెడీ చేసుకునే టేస్టీ టేస్టీ “కొత్తిమీర రైస్”.. రుచి అమోఘం..

Coriander Rice : పది నిమిషాల్లో రెడీ చేసుకునే టేస్టీ టేస్టీ “కొత్తిమీర రైస్”.. రుచి అమోఘం.. కొత్తిమీరను మనం రోజూ వివిధ వంటకాల్లో వాడుతుంటాం. సాధారణంగా దీన్ని వంట చివరిలో జోడిస్తాం. అయితే, తినేటప్పుడు చాలా మంది కొత్తిమీరను పక్కన పెట్టేస్తారు. కానీ, కొత్తిమీర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎవరూ అలా చేయరు.

కొత్తిమీర అనేక ఆరోగ్యకరమైన లాభాలను అందిస్తుంది మరియు వివిధ ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కొత్తిమీరను నేరుగా తినలేని వారు దానితో రుచికరమైన కొత్తిమీర రైస్ తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసినా దాని ప్రయోజనాలు పొందవచ్చు. మరి, కొత్తిమీర రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం!

కొత్తిమీర రైస్ తయారీకి కావలసిన పదార్థాలు:
అన్నం – అర కిలో బియ్యంతో ఉడికించిన అన్నం
కొత్తిమీర – అన్నానికి సరిపడేంత
పచ్చిమిర్చి – 5 లేదా 6
తరిగిన క్యారెట్ ముక్కలు – 1 కప్పు
పచ్చి బఠానీ – అర కప్పు
జీలకర్ర – అర టీస్పూన్
తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 1 కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
బిర్యానీ ఆకు – 2
దాల్చినచెక్క – 2 చిన్న ముక్కలు
యాలకులు – 3
లవంగాలు – 5
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – 1 టీస్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – 2 టీస్పూన్లు

కొత్తిమీర రైస్ తయారీ విధానం:
ముందుగా ఉడికించిన అన్నాన్ని చల్లగా, పొడిగా ఆరబెట్టుకోవాలి.ఒక మిక్సీ జార్‌లో కొత్తిమీర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.
ఒక కళాయిలో నూనె వేసి వేడి చేసిన తర్వాత బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్ర వేసి కొద్దిగా వేయించాలి.

తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, క్యారెట్ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి.కూరగాయలు వేగిన తర్వాత ముందుగా తయారు చేసిన కొత్తిమీర పేస్ట్ వేసి, మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి.

ఇప్పుడు ఆరబెట్టిన అన్నాన్ని జోడించి బాగా కలపాలి.రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసి మరోసారి కలుపుకోవాలి.మూత పెట్టి మరో 5 నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆపేయాలి.

ఇలా చేస్తే రుచికరమైన కొత్తిమీర రైస్ సిద్ధం అవుతుంది. ఈ రైస్‌లో పనీర్ ముక్కలు లేదా కాలీఫ్లవర్ ముక్కలు కూడా జోడించవచ్చు. దీన్ని నేరుగా లేదా పెరుగు చట్నీతో కలిపి తినవచ్చు. ఈ విధంగా వెరైటీగా తయారు చేస్తే రుచితో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.