Gongura Pulihora:ఎన్నో పోషకాలు ఉన్న గోంగూర పులిహోర ఇలాచేస్తే టేస్ట్ అదిరిపోద్ది..
Gongura Pulihora:ఎన్నో పోషకాలు ఉన్న గోంగూర పులిహోర ఇలాచేస్తే టేస్ట్ అదిరిపోద్ది.. మనం వంటింట్లో తరచూ పులిహోరను తయారు చేస్తుంటాం. సాధారణంగా చింతపండు, నిమ్మకాయలు, అప్పుడప్పుడు మామిడికాయలతో పులిహోరను తయారు చేస్తాం. పులిహోర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, ఈ సాంప్రదాయ పదార్థాలతో పాటు గోంగూరతో కూడా పులిహోరను తయారు చేయవచ్చు.
గోంగూరతో చేసే పులిహోర కూడా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. గోంగూరను సాధారణంగా పచ్చడి లేదా పప్పు కూరల తయారీకి ఉపయోగిస్తాం, కానీ దీనితో పులిహోర కూడా చేయవచ్చు. ఈ రుచికరమైన గోంగూర పులిహోరను ఎలా తయారు చేయాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు:
అన్నం: పావు కిలో బియ్యంతో ఉడికించిన అన్నం
గోంగూర: ఒక పెద్ద కట్ట
శనగపప్పు: 2 టేబుల్ స్పూన్లు
ధనియాలు: 1 టేబుల్ స్పూన్
నువ్వులు: 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు: 5 లేదా 6
నూనె: 1 టీ స్పూన్
తాళింపు కోసం కావాల్సిన పదార్థాలు:
నూనె: 4 టేబుల్ స్పూన్లు
పల్లీలు: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
శనగపప్పు: 1 టేబుల్ స్పూన్
మినపప్పు: 1 టేబుల్ స్పూన్
జీలకర్ర: అర టీ స్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
పచ్చిమిర్చి (తరిగినవి): 4
కరివేపాకు: 2 రెబ్బలు
పసుపు: అర టీ స్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర (తరిగినది): కొద్దిగా

గోంగూర పులిహోర తయారీ విధానం:
ముందుగా ఒక కళాయిలో శనగపప్పు, ధనియాలు, ఎండు మిరపకాయలను వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత నువ్వులను వేసి వేయించి, చల్లారిన తర్వాత జార్‌లో వేసి మెత్తని పొడిగా చేయాలి.అదే కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి, కాగిన తర్వాత గోంగూరను వేసి మెత్తగా ఉడికే వరకు వేయించాలి.వేరే కళాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి, కాగిన తర్వాత పల్లీలు, జీడిపప్పును వేసి వేయించి ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టాలి.
అదే నూనెలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.ఇప్పుడు ఉడికించిన గోంగూర, పొడిగా చేసిన మిశ్రమం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి 5 నిమిషాల పాటు వేయించాలి. ఈ మిశ్రమంలో కొంత భాగాన్ని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని వేసి, వేయించిన మిశ్రమంతో బాగా కలపాలి. రుచి చూసి, పులుపు తక్కువగా ఉంటే పక్కన పెట్టిన గోంగూర మిశ్రమాన్ని కలపాలి. మూత పెట్టి, చిన్న మంటపై 2 నిమిషాలు ఉంచి, స్టవ్ ఆఫ్ చేయాలి.చివరగా, వేయించిన పల్లీలు, జీడిపప్పు, తరిగిన కొత్తిమీరను వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల రుచికరమైన గోంగూర పులిహోర సిద్దం అవుతుంది. ఇక సర్వ్ చేయటమే..
గోంగూర పులిహోర ప్రయోజనాలు:
సాంప్రదాయ చింతపండు పులిహోరకు బదులుగా గోంగూర పులిహోరను అప్పుడప్పుడూ తయారు చేసుకోవడం వల్ల రుచితో పాటు గోంగూర యొక్క ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. గోంగూరలో ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి.
ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడం, కంటి చూపును మెరుగుపరచడం, రక్తహీనతను తగ్గించడం, జీర్ణశక్తిని మెరుగుపరచడం వంటి ప్రయోజనాలను అందిస్తాయి.ఈ విధంగా, గోంగూర పులిహోర రుచికరమైన ఆహారంగా మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఎంపికగా కూడా ఉపయోగపడుతుంది. వారంలో రెండు సార్లు గోంగూర తింటే మంచిది.
ఎప్పుడు గోంగూరతో పచ్చడి,పప్పు వంటివే కాకుండా ఇలా పులిహోర చేసుకుంటే పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది. గోంగూరలో మన శరీరానికి అవసరమైన పోషకాలు చాలా సమృద్దిగా ఉంటాయి. గోంగూర సంవత్సరం పొడవునా చాలా తక్కువ ధరలో చాలా విరివిగానే అందుబాటులో ఉంటుంది.
కాబట్టి ఒకసారి గోంగూర పులిహోర చేసుకొని రుచిని ఆస్వాదించండి. గోంగూర పులిహోర చేయటం కూడా చాలా సులువే. కాబట్టి ఒక సారి తప్పనిసరిగా చేయండి..

