Movies

సింధు తులానీ ఇప్పుడు ఏం చేస్తోంది? భర్త ఎవరో తెలుసా?

చూడగానే ఆకట్టుకొనే రూపంతో ఉండే సింధు తులాని ముంబై భామ అయినా దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందింది. తమిళం, కన్నడ భాషల్లో చేసినా తెలుగు హీరోయిన్ గానే ఎక్కువగా పాపులర్ అయింది. తెలుగులో దాదాపు 30కి పైగా సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. సింధు తులాని స్వస్థలం ముంబయి. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగులే. తండ్రి స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగం చేసి రిటైరయ్యారు. తల్లి ఇప్పటికీ ఇండియన్ రైల్వేస్ లో జాబ్ చేస్తోంది. సింధుకు ఓ చెల్లెలుంది. ఆమె పేరు నేహా. తను ప్రస్తుతం ఎయిర్ లైన్స్ లో ఉద్యోగి. అంతేకాదు పార్ట్ టైమ్ డీజేగా కూడా పనిచేస్తోంది.

సింధు తులాని గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాక థియేటర్ కోర్సు చేసింది. చదువుకునే రోజుల్లోనే డ్రామాలు వేస్తూ నటనపై ఆసక్తి పెంచుకుంది. మొదట్లో ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కు మోడలింగ్ చేసిన ఈ నార్త్ ఇండియా భామ బాలీవుడ్ లో మొహబ్బతే చిత్రంలో హీరోయిన్ షమితా శెట్టి ఫ్రెండ్ గా చేసింది.

అయితే కొత్త అమ్మాయి కోసం ప్రయత్నిస్తూ తెలుగు డైరక్టర్ గుణ్నం గంగరాజు ముంబయి వెళ్లగా అక్కడ ఆయనకు సింధు తులాని కనిపించింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు ఆయన మరెవ్వరినీ ఆడిషన్ కు పిలవకుండా సింధు తులానీని ఎంపిక చేసుకున్నాడు. ఆ విధంగా ఐతే సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది.

ఆ తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా అతనొక్కడే చిత్రం సింధుకు కమర్షియల్ బ్రేకిచ్చింది. తమిళంలో సింబు హీరోగా మన్మథ చిత్రం చేసి కోలీవుడ్ లో కూడా పాగా వేసింది. పోతేపోనీ, బతుకమ్మ వంటి చిత్రాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు చేసి అవార్డులు అందుకుంది సింధు తులాని. అయితే సినీ రంగంలో హీరోయిన్ గా అవకాశాలు తగ్గుతున్న తరుణంలో తన మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడి ఏడాది పాటు సినిమాలకు దూరమైంది.

సింధు తులానీ భర్త నార్త్ ఇండియన్. అతడు ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సింధు తులానీకి శ్వేత అనే కుమార్తె ఉంది. సింధు తులానీ స్పెషాలిటీ ఏంటంటే… చాలామంది సినీతారలు పెళ్లయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటారు. కానీ ఆమె మాత్రం పెళ్లయిన ఏడాదికే మళ్లీ చిత్ర పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చింది.

తనకు హీరోయిన్ పాత్రలే కావాలని డిమాండ్ చేయకుండా, కథకు ఇంపార్టెన్స్ ఉన్న చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్ వంటి చిత్రాల్లో సింధు తులానీ పోషించిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది.

ఇక టెలివిజన్ రంగంలో కూడా ప్రవేశించి సోనీ టీవీలో కుటుంబ్ అనే టీవీ సీరియల్ లో కూడా నటించింది. అంతేకాదు.. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నేట్రు, ఇండ్రు, నాలై అనే నాటకాల్లోనూ తన ప్రతిభను చాటుకుంది.