సయాటికా సమస్య పరిష్కారానికి మయూరాసనం

మారిన ఆహారపుటలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి పలు కారణాల వల్ల జీవ క్రియలు మందగించి మలబద్దకానికి దారితీస్తుంది. ఈ సమస్య దీర్ఘకాలం కొనసాగితే శరీరంలో వ్యర్థాలు పేరుకుపోయి మనిషి రోగిగా మారతాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఆహారపుటలవాట్లలో మార్పులతో బాటు కొన్నియోగాసనాలు సాయపడతాయి. ఇలాంటి ఆసనాల్లో మయూరాసనం ఒకటి. ఈ ఆసనపు భంగిమ నిలబడి ఉన్న నెమలిని పోలి ఉంటుంది గనుక దీనికా పేరు వచ్చింది.

ఆసనం వేసే పద్దతి

చదునైన నెల మీద ముందుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత కొద్దిగా ముందుకు వంగి అరచేతులను పాదాలవైపు తిప్పి ఆనించాలి. పాదములు నేలపై ఉంచాలి. తర్వాత 3 సార్లు నెమ్మదిగా శ్వాస తీసుకొని వదలాలి. ఇప్పుడు మరింత ముందుకు వంగి గట్టిగా గాలి పీల్చి మోచేతుల మీద పొట్టను ఆనిస్తూ కాళ్ళను కలిపి పైకి లేపాలి. బొడ్డుకు రెండువైపులా రెండుచేతులు పెట్టుకొంటే అటూ ఇటూ ఊగకుండా కాళ్ళు లేపొచ్చు. ఈ భంగిమలో శరీరం భూమికి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. ఈ స్థితిలో అరనిమిషం పాటు ఉండి నెమ్మదిగా శ్వాస వదులుతూ పూర్వస్థితికి రావాలి. ప్రతి రోజూ సాధన చేస్తూ ఆసన స్థితి సమయాన్ని పెంచాలి. అధికబరువున్న వారు కొత్తగా ఈ ఆసనాన్ని సాధన చేసేటప్పుడు శరీరాన్ని చేతుల మీద నిలపలేకపోయినా సాధన చేసేకొద్దీ అలవాటవుతుంది.

ప్రయోజనాలు
ఆహారం ప్రవేశించే అన్నవాహిక మొదలు మలవిసర్జన చేసే పాయువు వరకు మొత్తం పేగు శుభ్రపడుతుంది.
జీవక్రియలు పెరిగి ఉత్సాహంగా పనిచేయగలుగుతారు.
వెన్నుపూస, మెడ, ఉదర, నడుము, చేతి కండరాలు బలపడతాయి.
శరీరపు పిత్త, వాత, కఫ దోషాలు తొలగిపోతాయి.
ఆకలిలేమి, అజీర్తి వంటి సమస్యలు తొలగిపోతాయి.
రక్త ప్రసరణ మెరుగై రక్తంలోని వ్యర్థాలు, మలినాలు తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది.
రోజూ ఈ ఆసన సాధన చేస్తే సయాటికా, మధుమేహం, శ్వాసకోశ సమస్యలు అదుపులో ఉంటాయి.

గమనిక: హృదయ సమస్యలు, అధిక రక్తపోటు, హెర్నియా, కడుపులో అల్సర్‌ బాధితులు ఈ ఆసనాన్ని సాధన చేయకూడదు.