Health

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే గోముఖాసనం

కూర్చోగల ఏ ప్రదేశంలోనైనా సులభంగా సాధన చేయదగిన ఆసనాల్లో గోముఖాసనం ఒకటి. చూసేందుకు ఆవు ముఖం భంగిమలో ఉండే ఆసనం గనుక దీన్ని గోముఖాసనం అంటారు. రోజూ ఈ ఆసనం సాధన చేస్తే కీళ్ళనొప్పుల నివారణ, నియంత్రణ పూర్తిగా సాధ్యమవుతాయి.

సాధనా పద్దతి
ముందుగా కాళ్ళు సౌకర్యవంతంగా చాచి కూర్చోవాలి.
ఇప్పుడు నెమ్మదిగా ఎడమ కాలును చిత్రంలో మాదిరిగా మడిచి దానిపై కుడి కాలిని తీసుకురావాలి.
ఈ భంగిమలో అరికాళ్ళు వీలున్న మేరకు పైకి చూస్తూ ఉండాలి.
ఇప్పుడు కుడి చేతిని లేపి తలమీదుగా , ఎడమచేతిని వెనక్కితిప్పి కిందిగా వీపు మీదికి తెచ్చి చేతివేళ్ళతో బంధించాలి.
ఈ భంగిమలో తల ఎడమవైపు త్రిప్పుతూ శ్వాస తీసుకుని కుడివైపు తిరిగి శ్వాస వదలాలి.
తర్వాత కాళ్ళను మార్చి చేయాలి. ఇలా 4 లేక 5 సార్లు చేయాలి.

ప్రయోజనాలు
ఈ ఆసనం సాధన చేస్తే వెన్నుపూస, మెడ, భుజం నొప్పులు తగ్గుతాయి.
ఊపిరి తిత్తుల పనితీరును మెరుగుపరచి శ్వాస సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుంది.
ఉదరభాగపు కండరాలు బలోపేతమవుతాయి.
హెర్నియా బాధితులకు ఈ ఆసనం ఉపశమనాన్నిస్తుంది.
శరీరంలోని గ్రంథులు చురుగ్గా పనిచేసి ఆరోగ్యం మెరుగుపడేలా చేస్తుంది.
మధుమేహం, అతిమూత్రం, ఇంద్రియ బలహీనత, రక్తపోటు వంటి సమస్యలు అదుపులో ఉంటాయి.

గమనిక: ప్రారంభంలో చేతులు అందకపోతే సాధ్యం కాకపోతే రుమాలును ఉపయోగించాలి. అయినా.. ఇబ్బందిగా ఉన్నవారు చేతులతో పాదాల బొటన వ్రేళ్ళను పట్టుకొని ముందుకు వంగి ఈ ఆసనాన్ని సాధన చేయవచ్చు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."