Devotional

2018 జూలై 27 సంపూర్ణ చంద్రగ్రహణం రోజు ఏ నక్షత్రం వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ?

గ్రహణాలు ఏర్పడడం మామూలే కానీ గ్రహణ ప్రభావం కొన్ని రాశులపై పడుతుందని అందుచేతే అలాంటి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య వేత్తలు ముందుగానే చెబుతుంటారు. ఇక 2018జులై 27వ తేదీ ఆషాఢ మాసం శుక్ల పౌర్ణమి, శుక్రవారం నాడు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. సంపూర్ణ చంద్ర గ్రహణం గా ఏర్పడబోతున్న ఈ గ్రహణం ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై ప్రభావం చూపుతుంది. గ్రహణ దోష నివారణకు చేయాల్సిన పనులు కూడా ఉంటాయి. జులై 27రాత్రి 11.54 లకు మొదలయ్యే ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం మరుసటి రోజు (శనివారం) తెల్లవారు ఝామున 3.49లకు గ్రహణం విడుస్తుంది. 3.54 గంటల పాటు వుండే సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఇది. పైగా కేతు గ్రస్తమైన గ్రహణం అని నిపుణులు చెబుతున్నారు. రాత్రి 11.54 లకు పట్టు స్నానం,తెల్లవారు ఝామున 3.49లకు విడుపు స్నానం చేయాలి.

గ్రహణం పట్టి విడిపోయే మధ్య కాలంలో మంత్రానుష్టానం చేసుకోవాలని జ్యోతిష ప్రముఖులు సూచిస్తున్నారు. అలాగే మంత్రానుష్టానం లేనివాళ్లు విష్ణు సహస్ర నామం,లలితా సహస్ర నామం పారాయణ చేసుకోవచ్చని చెబుతున్నారు. దీనివలన మంచి జరుగుతుందని అంటున్నారు. ఇక గ్రహణ సమయంలో దానం చేస్తే విశేష పుణ్యాన్ని కలగజేస్తుందని,శక్తి గలవారు కురుక్షేత్రం వెళ్లి దానం చేయవచ్చు, లేదా ఎవరి ఇంటి దగ్గర వారు దానం చేసుకోవచ్చు.

ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాలపై గ్రహణ ప్రభావం పడుతున్నందున, ఈ నక్షత్రాల వారు గ్రహణం పట్టే సమయంలో కంచు పాత్రలో నెయ్యివేసి, అందులో బంగారు సర్పం,వెండి చంద్రుడి ప్రతిమలు ఉంచి, గ్రహణం విడిపోయాక, సూర్యోదయం తర్వాత పురోహితునికి దానం చేస్తే మంచిదని కొందరు జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

ఒకవేళ ఉత్తరాషాఢ,శ్రవణా నక్షత్రాల వారు ఈ దానం చేయలేని పక్షంలో శనివారం ఉదయం మహాన్యాస ఏకాదశ రుద్రభిషేకం చేయించుకున్నా సరిపోతుందని అంటున్నారు. ఒకవేళ ఆరోజు కుదరకపోయినా సరే,11రోజుల్లోగా ఈ అభిషేకం చేయించుకోవచ్చట. మూడో మార్గంగా కెజింపావు బియ్యం,కెజింపావు ఉలవలు,తెల్లని వస్త్రం, రంగుల రంగుల వస్త్రం కలిపి దానం చేసినా మంచిదేనని సూచిస్తున్నారు. అయితే రుద్రాభిషేకము విశేష పుణ్యం ఇస్తుందని అంటున్నారు.

ఇవేవీ చేయడం కుదరని పక్షంలో ఆరు మాసాలపాటు శివ కవచం పఠిస్తే మంచిదని కూడా అంటున్నారు. గ్రహాల ప్రభావం మనసుపై పడుతుందని అందుకే గ్రహణ ప్రభావం గల నక్షత్రాల వారు నివారణకు తగిన మార్గాలు అనుసరించడం శ్రేయోదాయకమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుదన్నారు.