అలనాటి ముద్దుగుమ్మ పూర్ణిమ గుర్తు ఉందా … ఆమె ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?
తెలుగు తెరపై చినుకులా రాలి అంటూ ప్రణయ గీతం పాడిన బబ్లీ, హోమ్లీ గాళ్ పూర్ణిమ గుర్తుందా? ఈమె లంగా ఓణీ వేసుకుని గలగలా మాట్లాడుతుంటే, ముద్దుకే ముద్దొచ్చే మందారం లా కనిపించేది. ఎక్స్ పోజింగ్ కి, మోడర్న్ డ్రెస్సులకు నో చెప్పిన పూర్ణిమ అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా,పక్కింటి అమ్మాయిలా సినిమాల్లో కనిపించేది. 1980 దశకంలో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్దమందారం,నాలుగు స్తంభాలాట,శ్రీవారికి ప్రేమలేఖ, కోడి రామకృష్ణ డైరెక్షన్ లో మా పల్లెలో గోపాలుడు వంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. మచిలీ పట్నానికి చెందిన ఈమె తండ్రికి తన కూతురు సినిమాల్లో నటించడం ఇష్టం లేదట. అయితే తల్లి బలవంతం మీద ఒప్పుకోక తప్పలేదు.
ఆరేళ్ళ వయస్సులో మహానటి సావిత్రితో కల్సి పూర్ణిమ నటించింది. సావిత్రి చివరి చిత్రం సత్యహరిశ్చంద్ర మూవీలో కల్సి నటించిన పూర్ణిమ మంచి నటి అవుతావనే కామెంట్ కూడా సావిత్రి నుంచి అందుకుంది. ఇక అంతకుముందు ఓ చిత్రంలో చిన్న నిడివి గల పాత్రలో కూడా నటించింది. సావిత్రి చివరి చిత్రంలో నటించడమే కాకుండా మంచి నటి అవుతానన్న దీవెన పొందడం వలన 100చిత్రాల్లో నటించానని పూర్ణిమ ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.నిజానికి ఈమె 13ఏళ్ల ప్రాయంలోనే హీరోయిన్ అయిపొయింది.
మెగాస్టార్ చిరంజీవితో కల్సి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య,దొంగ చిత్రాల్లో నటించిన పూర్ణిమ ఆదిలక్ష్మి,కొంటె కోడళ్ళు, కృష్ణ గారడీ వంటి చిత్రాల్లో నటించింది. అప్పట్లో నరేష్,ప్రదీప్, రాజేష్,సుమన్, అర్జున్ వంటి హీరోలతో నటించి బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఇక కృష్ణ, శోభన్ బాబు వంటి స్టార్స్ పక్కన జోడీ కుదరకపోవడంతో ఆనాటి స్టార్స్ అందరి చిత్రాల్లో చెల్లెలి పాత్రలో నటించి రాణించింది.
మలయాళంలో సుధా పేరిట నటించిన పూర్ణిమ కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది.ఇక చిన్న వయస్సులోనే ఇండస్ట్రీకి రావడం వలన చాలామంది పూర్ణిమను టింగరి అని, చిరంజీవి వంటి వాళ్ళు పూరి,పూరి అని సరదాగా పిలిచేవారు. ఇక చిన్న వయస్సులోనే ఎమోషన్స్ పండించే బలమైన, బరువైన పాత్రలు పోషించి మెప్పించింది. పరికిణీ , ఓణీ, చీరల్లో కనిపించే పాత్రలు ఆమెకు రావడం మరో అదృష్టం. కంటతడి పెట్టించే బరువైన పాత్రల్లో కూడా ఒదిగిపోయేది.
అయితే మలయాళంలో గ్లామర్ రోల్స్ వచ్చినా ఒప్పుకోలేదు. సినిమాల్లో ఉన్నప్పుడు మద్రాసులో సెటిల్ అయిన ఈమె పెళ్లయ్యాక భర్త మెరైన్ ఇంజనీర్ కావడంతో వైజాగ్ లో సెటిల్ అయింది. ఈమెకి ఓ పాప, ఓ బాబు ఉన్నారు. కొడుకు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురికి కూడా పెళ్ళైపోవడంతో సినిమాల్లో తల్లి,వదిన వంటి పాత్రలతో రాణిస్తోంది.